కృష్ణంరాజు.. హీరోగా, నటునిగా, కెరీర్ మొదట్లో విలన్‌గా కూడా రాణించాడు. ఆ తర్వాత రెబెల్‌స్టార్ స్థాయికి ఎదిగాడు. ఇక ఆయన నిర్మాతగా కూడా ఎంతో సక్సెస్ అయ్యాడు. గోపీకృష్ణా బేనర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. ఇక ఆయన ప్రభాస్ హీరోగా తాను చేసిన 'భక్తకన్నప్ప' చిత్రాన్ని తన సొంత దర్శకత్వంలో చేయాలని కృష్ణంరాజు కోరిక. మరోవైపు ఆయనకు 'విశాల నేత్రాలు' అనే నవలను సినిమా తీయడం కూడా డ్రీమ్ ప్రాజెక్ట్. అయితే 'భక్తకన్నప్ప' విషయంలో తనికెళ్లభరణి స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఆయన ఈ చిత్రాన్ని సునీల్‌తో తీయాలని భావించాడు. చివరకు ఆ స్క్రిప్ట్ మోహన్‌బాబు చెంతకు చేరింది. ఇదే స్క్రిప్ట్‌తో తాను, మంచు విష్ణు కలిసి నటిస్తూ, తానే దర్శకునిగా మారి హాలీవుడ్ రేంజ్‌లో 'భక్తకన్నప్ప'ని తీయాలని మోహన్‌బాబు ఆలోచన.
మరోవైపు ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి తనకే ఇవ్వాలని కృష్ణంరాజు కోరాడని, కానీ మోహన్‌బాబు ఒప్పుకోలేదని, కావాలంటే మీ పాటికి మీరు ఆ చిత్రం తీయండి, నా పాటికి నేను కూడా ఆ చిత్రం చేస్తానని చెప్పాడని ఆ మద్య వార్తలు వచ్చాయి. ఇక తాజాగా కృష్ణంరాజు గోపీకృష్ణా బేనర్‌లో 'ఒక్క అడుగు, దందా' అనే రెండు టైటిల్స్‌ని రిజిష్టర్ చేయించాడు. ఇందులో 'దందా' చిత్రాన్ని ప్రభాస్ హీరోగా తమ గోపీకృష్ణా బేనర్‌లో కృష్ణంరాజు దర్శకునిగా మారి తన తొలి చిత్రంగా తీయనున్నాడనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నేషనల్‌స్టార్ అయ్యాడు. ఆయన క్రేజ్‌ని వాడుకోవడానికి టాలీవుడ్ కోలీవుడ్ నిర్మాతలే కాదు.. బాలీవుడ్‌లో కరుణ్‌జోహార్ వంటి వారు కూడా ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభాస్‌కి ఓన్ బేనర్ వంటి యువీ క్రియేషన్స్‌లో ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చేస్తున్నాడు. కరణ్‌జోహార్‌ని కాదని ఆయన ఈ చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాతి చిత్రాన్ని కూడా 'జిల్'ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్‌లోనే చేస్తాడని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణంరాజుకే మొదటి సారి దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం అంటే ప్రభాస్ దృష్టిలో, ఆయన ప్రస్తుతం ఉన్న రేంజ్‌లో అది సాహసమే కాదు.. నిజంగా ఓ ప్రయోగం కూడా. అయినా ప్రభాస్ తన పెద్దనాన్న కోసం ఈ చిత్రం చేయడం దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్నాయి.