సినిమాలలో, రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. అలాగే రాజకీయాలలో ఆత్మహత్యలేగానీ హత్యలుండవనే సామెత కూడా అందరికీ తెలిసిందే. ఇక అవసరం, సమయం అనేవి ఎవరినైనా ఇట్టే మార్చేస్తాయి. అనవసరంగా అభిమానులు, ప్రేక్షకులు, సాధారణ ప్రజలు దీనిపై చర్చించుకుని, తగవులు పెట్టుకోవడం తప్పితే పెద్దలు ఎప్పుడు 'పెద్దలే'. వారికి వారు ఎంతో కావాల్సిన వారు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా 'ప్రజారాజ్యం' పార్టీని పెట్టి కాంగ్రెస్ నాయకులను చిరు విమర్శించిన విషయం తెలిసిందే. ఇక ఒకనాడు కమ్యూనిస్ట్‌లతో కలిసి చంద్రబాబు తర్వాత బిజెపితో, మరలా వామపక్షాలతో, ఇప్పుడు బిజెపితో జతకట్టాడు.
బిజెపికి వ్యతిరేకమని చెప్పి, మైనార్టీలకు, క్రిస్టియన్లకు బిజెపి దూరమని విమర్శించిన జగన్ తదుపరి కాలంలో బిజెపిపై నోరు మెదపలేదు. ప్రత్యేకహోదా ఇచ్చే బాధ్యత కేంద్రానిది అని తెలిసినా, ప్రత్యేక హోదా విషయంలో ఆయన చంద్రబాబుని ప్రశ్నిస్తాడే గానీ మోదీని ప్రశ్నించడు. ఇంకా రాష్ట్రపతి కాకముందే బిజెపి అభ్యర్థి అయిన రామ్‌నాథ్ కోవిందు కాళ్లపై పడి మొక్కుతీర్చుకున్నాడు. ఇక జగన్ కేసీఆర్ విషయంలో మాత్రం పల్లెత్తుమాట అనడు. ఇక కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పెట్టిన ప్రజారాజ్యాన్నిచిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. విభజన వద్దని చెప్పిన పార్టీలు కూడా కేవలం ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా ఏర్పడిన టీఆర్‌ఎస్‌తో, ఇక ఎంఐఎం వంటి పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ఘనాపాఠీలు ఎందరో ఉన్నారు.
ఇక తాజాగా పవన్‌కళ్యాణ్ కూడా రోజులు గడిచే కొద్ది తాను కూడా రాజకీయవేషాలు వేయడంతో తక్కువేమీ తినలేదని నిరూపించాడు. అందుకే ఆయన ఆ మద్య ముందు జాగ్రత్తగా తాను కూడా ఎందరినో విమర్శిస్తూ ఉంటానని, కానీ వారు కలిస్తే నవ్వుతూ మాట్లాడుతానని, షబ్బీర్ అలీ, దానం నాగేందర్‌ల పేర్లు చెబుతూ వ్యాఖ్యానించాడు. ఇక తాజాగా పవన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి ఏకాంతంగా ముచ్చట్లు జరిపాడు. ఈ భేటీ రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అయింది. మరో వైపు కేవలం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికే తాను కేసీఆర్‌ని కలిశానని పవన్ అంటున్నాడు. మరోవైపు ఆయన నటించిన 'అజ్ఞాతవాసి' జనవరి 10న విడుదల కానుంది. ఎలాగూ పవన్‌కి బాబుతో మంచి దోస్తీ ఉంది. ఇక తెలంగాణలో కూడా కేసీఆర్‌ని కలుసుకుని, చిత్రానికి ముందు రోజు నుంచే ప్రీమియర్ షోలు, టిక్కెట్ల పెంపు వంటి వాటి విషయంలో సహాయం కోరేందుకే ఆయన వెళ్లాడని అంటున్నారు.
ఇక ఇది వర్మ కంట్లో పడింది. దాంతో ఆయన గతంలో పవన్ కేసీఆర్‌ని ఉద్దేశించి, 'కేసీఆర్ తాట తీస్తా.. అనడాన్ని, పవన్‌ని ఉద్దేంచి కేసీఆర్ ఆయన పేరు కూడా తెలియని వాడిలా 'వాడి పేరు ఎంది బై.. ' అన్న విషయాలను గుర్తుచేస్తూ రాజకీయాలంటే ఇలానే ఉంటాయని చెప్పకనే చెప్పాడు. అవసరం, సమయం రాజకీయనాయకులను మార్చివేస్తుంది. 'జై రాజకీయ నాయకుల్లారా' అంటూ పోస్ట్ చేయడం ఇప్పుడు కాకను రేపుతోంది.