ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆలయవాణి రేడియో జాకీగా పనిచేస్తున్న ఒక మహిళను గజల్ శ్రీనివాస్ లైంగికంగా వేధించాడని ఆ మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా.... ఆ ఫిర్యాదు ఆధారంగా గజల్ శ్రీనివాస్‌ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.
గజల్ శ్రీనివాస్ ఆఫీస్ లో పని చేస్తున్నఆ మహిళను శ్రీనివాస్ మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని... ఆ మహిళా సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో గజల్ శ్రీనివాస్ బలవంతంగా మసాజ్ చేయించుకున్నాడని... ఆఫీస్ లోని రెస్ట్ రూమ్ లోకి తనని పిలిపించి అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని ఆ మహిళ.. పోలీస్ లకు తెలిపింది. అయితే గజల్ శ్రీనివాస్ కి సహకరించమని పార్వతి అనే శ్రీనివాస్ పనిమనిషి తనని మానసికంగా వేధించిందని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. శ్రీనివాస్ కి సహరించకపోతే ఉద్యోగం నుండి తీసేస్తానని... ఒకవేళ సహకరిస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ పెట్టారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
దాదాపు ఏడాది నుండి గజల్ శ్రీనివాస్ తనను వేధిస్తున్నాడని..... రెండు నెలల నుండి వేధింపులు ఎక్కువ అయ్యాయని బాధితురాలు తెలిపింది. పక్కా సాక్ష్యాలు సంపాదించిన తర్వాతనే పోలీసులుకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇక గజల్ శ్రీనివాస్ ని అరెస్ట్ చేసిన పోలీస్ లు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా... శ్రీనివాస్ కి కోర్టు ఈ నెల 12 వరకు రిమాండ్ విధించింది. అయితే గజల్ శ్రీనివాస్ ఈ వ్యవహారంపై మీడియా ఎదుట తాను అమాయకుడినని.. ఆమె కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని తెలిపాడు.. అసలామె ఎందుకు ఇలా నాపై తప్పుడు కేసు పెట్టిందో నాకు తెలియదని అంటున్నాడు.
ఇకపోతే గజల్ శ్రీనివాస్ బెయిల్ కోసం బెయిల్ పిటిషన్ ని కోర్టుకు సమర్పించాడు. ఇక గజల్ కి బెయిల్ పై నాంపల్లి కోర్టులో వాదనలు జరగాల్సి ఉండగా... గజల్ ని పోలీస్ లు రిమాండ్ కోసం చంచల్ గూడా జైలుకి తరలించారు.