కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కూడా గెలవలేని వ్యక్తులు, అడ్డదారుల్లో రాజ్యసభ ద్వారా ఎంపీలవుతున్నారు. చివరకు వారికి కార్పొరేటర్‌గా కూడా గెలిచే స్థాయి లేదు. వారి మొహాలు చూసి ఎవ్వరు ఓట్లు వేయరు. వీరంతా కలిసి మేధావులు ఉండాల్సిన రాజ్యసభలను, శాసనమండలి వంటి వాటిని కించపరుస్తున్నారు. ఇక దేశంలోనే పెద్ద నేతలుగా ఫీలయ్యే బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, చిదంబరం, వెంకయ్యనాయుడు వంటి వారికి గెలవటం, ప్రజల్లో తిరగడం అనేది ఏనాడు తెలియదు. వీరు కేవలం బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలతో, లాబీయింగ్‌లతోనే ఉన్నత పదవులను చేజిక్కించుకున్నారు. ఇలాంటి వారు దేశంలో ఎందరో ఉన్నారు. ఇక మోదీ కూడా చాయ్‌వాలేనే. ఆయనేం గొప్ప రాజనీతిజ్ఞుడు కాదు.
ఇక విషయానికి వస్తే తాజాగా తమిళ సూపర్‌స్టార్‌గా మాత్రమే కాదు సౌతిండియన్ సూపర్‌స్టార్‌గా, ఆల్‌ఇండియా సూపర్‌స్టార్‌గా చెప్పుకోదగిన వ్యక్తి రజనీకాంత్. ఈయనకు నటునిగానే కాదు.. మంచి ఆధ్యాత్మిక వేత్తగా, దానకర్ణుడిగా, సింపుల్ వ్యక్తిగా ఎంతో పేరుంది. ఆయన తాజాగా రాజకీయ రంగ ప్రవేశం ఖాయం చేశాడు. జయలలిత మరణం, తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యత, పళని స్వామి, పన్నీరుసెల్వం వంటి వారి అసమర్ధత పుణ్యాన ప్రజలు మరో దిక్కులేక శశికళ వైపు ఆమె తరపు అభ్యర్ధిగా ఆర్కేనగర్ ఎన్నికల్లో గెలిచిన దినకరన్‌ని గెలిపించారంటే తమిళరాజకీయాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయో అర్ధమవుతోంది. ఇదే సమయంలో తలైవా తన రాజకీయ ఎంట్రీపై స్పష్టత ఇచ్చాడు. ఇవ్వడంతో పాటు తమిళనాడులోని రాజకీయ పరిస్థితులు, దేశరాజకీయాలు భ్రష్టుపడ్డాయని బిజెపికి కూడా భారీ కౌంటరే వేశాడు.
అంతేకాదు... తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా తమిళనాడులోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తానని తెలిపాడు. దీనిపై తమిళనాడు బిజెపి నేత, బ్లాక్‌మెయిల్‌కింగ్‌గా, తనకున్న న్యాయపరిజ్ఞానంతో అందరినీ ఇరుకున పెట్టే సుబ్రహ్మణ్యస్వామి స్పందిస్తూ రజనీ నిరక్షరాస్యుడని, ఆయనకు రాజ్యాంగం తెలియదని, రజనీ కేవలం రాజకీయాలలోకి వస్తానని చెప్పాడే గానీ తన విధివిధానాలు, ఇతర విషయాలను చెప్పలేదంటూ వ్యంగ్యంతో కూడిన సెటైర్లు వేశాడు. అసలు రజనీ గురించి మాట్లాడే అర్హత కూడా సుబ్రహ్మణ్యస్వామికి లేదు. నేడు దేశంలో నిరక్షరాస్యుల కంటే చదువుకున్న, మేధావుల వల్లనే దేశం భ్రష్టు పట్టిపోతోంది. మితిమీరిన వాక్‌స్వాతంత్య్రం, తమ మేథస్సుతో మాటలు నేర్చి, చట్టంలోని, రాజ్యాంగంలోని లోసుగులను ఉపయోగించుకుని లాభపడే వారికంటే నిజాయితీపరులైన నిరక్షరాస్యలే బెటర్ అని చెప్పాలి.
ఈ విషయంలో మాత్రం సుబ్రహ్మణ్యస్వామి రజనీపై చేసిన వ్యాఖ్యలు దారుణంగా నిరాశనిస్పృహల నుంచే వచ్చాయని, రజనీ బిజెపిలో కలిసే అవకాశం లేకపోవడం, మరోవైపు రజనీ ఆధ్యాత్మికతో కూడిన స్పిర్చువల్ పాలిటిక్స్ గురించి మాట్లాడటమే సుబ్రహ్మణ్యస్వామి అసహనానికి కారణమని చెప్పవచ్చు.