ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో నూతన సంవత్సర వేడుకలు
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 2017కు వీడ్కోలు చెబుతూ 2018 కి స్వాగతం పలుకుతూ సాగిన సంస్కృతోత్సవాలు కన్నులపండుగగా జరిగాయి. ఉదయభాను వ్యాఖ్యానంతో ప్రారంభమైన కార్యక్రమంతో మల్లికార్జున, గోపి పూర్ణిమ, సాయి చరణ్, హరిణి, పవన్ చరణ్, సాహితీ చాగంటి, జాహ్నవి, తెలుగు సినిమాల్లోని పాటలు పాడి వినిపించారు.
తరువాత సురేష్ వర్మ నృత్య దర్శకత్వంలో యువ నర్తకీమణులు చేసిన స్వాగత నృత్యం అందరినీ ఆకట్టుకుంది. తరువాత సంగీత దర్శకుడు కోటి, గాయనీ గాయకులతో ఆలపించిన గీతాలు కూడా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి.
ఈ సందర్భంగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు డాక్టర్ కేఎల్ నారాయణ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా కల్చరల్ సెంటర్ న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలంటే ఎంతోమంది ఆసక్తిని కనబరుస్తున్నారని, ఆ సంప్రదాయాన్ని, ఒరవడిని కొనసాగిస్తూ ప్రేక్షకులకు మంచి కార్యక్రమాల్ని అందిస్తున్నామని చెప్పారు.
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ జంట నగరాల్లోనే ప్రసిద్ధిగాంచిన సెంటర్ అని, దీని ప్రతిష్ఠను పెంచే కార్యక్రమాలనే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.
కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సంవత్సరమంతా గుర్తుంచుకునేలా విందు భోజనాన్ని కూడా ఏర్పాటు చేశామని అన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయ కర్త శైలజ మాట్లాడుతూ అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలను రూపొందించామని చెప్పారు.
కల్చరల్ సెంటర్ సభ్యులతో పాటు నగరంలోని ప్రముఖులెందరో న్యూ ఇయర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముళ్ళపూడి మోహన్, తుమ్మల రంగారావు, కాజా సూర్యనారాయణ, శివారెడ్డి, డాక్టర్ కే వెంకటేశ్వర్ రావు, హరిప్రసాద్, సురేష్ కొండేటి, బాలరాజు, పెద్దిరాజు, ప్రసన్న కుమార్, భగీరధ తదితరులు పాల్గొన్నారు.