సినిమాలలో అవకాశాలు తగ్గిన తర్వాత తమిళ హీరో కార్తీక్ నుంచి ఖుష్బూ, నగ్మా వరకు, స్మృతీఇరాని నుంచి హేమమాలిని వరకు అందరి చూపు రాజకీయాలపైకే మళ్లుతోంది. చివరకు అలీ, మురళీమోహన్, వేణుమాధవ్, రోజా, వాణివిశ్వనాథ్, జీవిత, శివాజీ వంటి అందరూ పాలిటిక్స్ వైపే చూస్తున్నారు. ఇక హీరో సుమన్ కూడా ఇప్పుడు అదే పనిలో పడినట్లు ఉన్నాడు. ఆయనది వాస్తవానికి మంగుళూరు. ఈయన మాతృభాష తుళు. కానీ ఈయన తెలుగులో హీరోగా రాణించి, ఆ తర్వాత బ్లూఫిల్మ్ కేసులో శిక్ష అనుభవించి, స్టార్ హోదాని కోల్పోయి ఏ పాత్ర ఇచ్చినా చేసే స్థాయికి వచ్చాడు. నిజానికి సుమన్ కెరీర్‌ని మూడు ఎంట్రీలుగా చెప్పవచ్చు.
మొదట హీరోగా చిరంజీవితో పోటీ పడిన కెరీర్ మొదటిది. తర్వాత ఏదో హీరోగా నటిస్తూ చివరకు రిలీజ్ కూడా అయ్యే స్థాయిలేని సిగ్రేడ్ చిత్రాలలో నటించడం ఒకటి. కానీ ఈయనకు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన 'శివాజీ' చిత్రంలో పవర్‌ఫుల్ ఫుల్‌లెంగ్త్ విలనీ అవకాశం వచ్చి ప్రశంసలు పొందాడు. ఇక 'అన్నమయ్య, శ్రీరామదాసు' వంటి చిత్రాలలో పౌరాణిక దేవుని పాత్రలకు ఎన్టీఆర్ తర్వాత కరెక్ట్‌గా సూట్ అవుతాడనే పేరు కూడా తెచ్చుకున్నా వాటిని ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. ఏదో చల్తీకా నామ్ గాడీ అనే తరహాలో బండి లాగిస్తున్నాడు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తానని చెప్పాడు.
ఇక విజయశాంతికి ఉన్నట్లుండి తెలంగాణ గుర్తుకు వచ్చినట్లు సుమన్‌కి ఇప్పుడు బిసీలు సడన్‌గా గుర్తుకు వచ్చారు. తాజాగా బిసీ సభలో పాల్గొని బిసీలకు రాయితీలుకాదు... రాజ్యాధికారం కావాలని చెప్పాడు. దీనికోసం తాను సినిమాలు మానేసి రాజకీయాలలోకి వచ్చి బిసీ హక్కుల కోసం పోరాడుతానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. బిసి బిల్లు కోసం అన్ని పార్టీలు కలిసి పార్లమెంట్‌లో పోరాడాలని పిలుపునిచ్చాడు.
బిసీ బిల్లుని పార్లమెంట్ ఆమోదించాలని, బిసీ జాతి అభ్యున్నతికి ఎజెండా తయారు చేయాలని కోరాడు. ఇక ఈయన గతంలో దక్షిణాదికి చెందిన వ్యక్తికి ఉప ప్రధాని పదవి ఇవ్వాలని కూడా రాజకీయ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజా సభకు పొన్నాల లక్ష్మయ్య కూడా హాజరయ్యాడు. మరి బిసీ నాయకుడు ఆర్.కృష్ణయ్య చలవతో సుమన్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైందనే చెప్పాలి.