ఈ ఏడాది దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాకముందు నుంచే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన చిత్రం 'పద్మావతి'. చిత్రం ప్రకటన, షూటింగ్ సమయంలోనే సెట్‌లని కాల్చేయడం, తుపాకులతో హిందు సంస్థలు, కర్ణిసేన ఆ చిత్రం దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై భౌతికదాడులు చేశారు. ఇక చిత్రం విడుదల అని ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఇలాంటి చిత్రాలను బ్యాన్ చేయాలని ఎందరో వీరనారిగా కొలిచే వారిని ఇలా తప్పుగా చూపిస్తున్నారంటూ సినిమా చూడకుండానే రగడ మొదలైంది. మరోవైపు ఇలాంటి చిత్రాలకు దావూద్ ఇబ్రహీం వంటి వారు ఫైనాన్స్ చేస్తూ, పెట్టుబడులు పెట్టి, హిందువుల మనోభావాలతో ఆటలు ఆడుతున్నారని కూడా వివాదం చెలరేగింది. దీంతో పలు రాష్ట్రాలు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా బ్యాన్ చేశాయి.
ఈ విషయంలో బిజెపినే కాదు.. కాంగ్రెస్ పార్టీ కూడా మౌనం వహించింది. ఈ చిత్రానికి బాసటగా నిలిచిన ముఖ్యమంత్రి కేవలం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రమే. ఇక ఈ చిత్రం విడుదల ఆగిపోవడం, సెన్సార్ కాకపోవడం తెలిసిందే. తాజాగా కేంద్ర సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి కొన్ని షరత్తులను విధించి యు/ఎ సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ చిత్రం పేరును 'పద్మావతి'గా కాకుండా 'పద్మావత్' అని మార్చాలని, ఇది కేవలం కల్పిత కథే గానీ ఏ రాష్ట్రానికి, ఎవ్వరికీ సంబంధించిన కథ కాదనే విషయాన్ని చిత్రం మొత్తంలో మూడు నాలుగు సార్లు ప్రదర్శించాలని, ఇక ఝూమర్ సాంగ్, ఇతర కొన్ని సీన్స్‌ని ఎడిట్ చేయాలని, సతీసహగమాన్ని హైలైట్ చేయకుండా రీషూట్ చేయాలనే నిబంధనలు విధించింది. సో... 'పద్మావతి' యూనిట్‌కి ఇది తీయని వార్తే. వీరికి ఈ ఏడాది 2017 కలిసి రాకున్నా 2018 కలిసి వచ్చేట్లుగా కనిపిస్తోంది. దీంతో ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా? అనే ఆసక్తి అందరిలో ఉంది.