అభిమానులను, తమిళ ప్రజలను ఎప్పటినుంచో ఊరిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఎట్టకేలకు జరిగిపోయింది. రజినీకాంత్ అభిమాన సంఘాలతో ఈ రోజు ఆదివారం నిర్వహించిన సమావేశాల్లో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేశారు. దేవుడు శాసించాడు రజిని పాటిస్తున్నారు అంటూ.. కొత్తగా రాజకీయాల్లోని మార్పు కోసమే రాజకీయాల్లోకి వస్తున్నట్టు... డబ్బు సంపాదించడానికి కానీ... పేరు సంపాదించడానికి కానీ కాదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లోపు తాను సొంతంగా రాజకీయపార్టీ పెడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేస్తానని స్పష్టమైన క్లారిటీ ఇచ్చేశాడు తలైవా. తమిళనాట కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలను బ్రష్టుపట్టించాయని.. తమ స్వార్ధపూరిత పనుల కోసం రాజకీయాలను వాడుకొన్నాయని తీవ్ర స్థాయిలో ఆయన మండి పడ్డారు. తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని.. ప్రజలు తన సమక్షంలో సుఖ శాంతులతో ఉంటారని... ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందిస్తానని రజిని మాటిచ్చారు. తన బలం తన అభిమానులేనని.... వారికి పార్టీలో పెద్ద పీట వేస్తానని చెప్పారు.
మరి రాజకీయాల్లోకి రజిని వస్తాడు వస్తాడు అని జరిగిన ప్రచారానికి ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చేశాడు. ఇకపోతే ప్రస్తుతం దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన రజినీకాంత్... మళ్ళీ దేవుడు శాసిస్తేనే సినిమాలు చేస్తాడేమో.... మరి ఆయన నటించిన '2.0' ఏప్రిల్ లో విడుదలవుతుండగా... మరో సినిమా కాలా ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడుదలకు సిద్దమవుతుంది.