తాజాగా ఆర్కేనగర్ ఉప ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా నిలిచాయి. ఎవ్వరూ ఊహించని విధంగా శశికళకి చెందిన దినకరన్ ఈ పోటీలో విజయం సాధించాడు. దాంతో జయలలిత మరణం తర్వాత స్థానం డీఎంకేకి గానీ, పన్నీరు సెల్వం, పళని స్వామిలది కూడా కాదని తేలిపోయింది. అంటే ఇప్పుడు పోటీ మొత్తం శశికళ వర్సెస్ కొత్త పార్టీ పెట్టనున్నానని చెప్పే అవకాశం ఉన్న రజనీల మద్యనే ఉంటుంది. ఈ ఫలితం తర్వాత రాష్ట్రంలో నిజమైన రాజకీయ శూన్యత ఉందని, మరో ఆప్షన్ లేకపోబట్టే ప్రజలు దినకరన్‌ని గెలిపించారని రజనీ ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు. భవిష్యత్తు అన్నాడీఎంకే, డీఎంకే, బిజెపి, కాంగ్రెస్ దేనికి లేదని నిర్ణయానికి వచ్చిన తర్వాతనే తలైవా స్పీడు పెంచాడు.
ఇక ఆయన ప్రస్తుతం తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకునేందుకు అభిమానులతో మలివిడత ఫొటో సెషన్స్ ఏర్పాటు చేశాడు. ఇక నా రాజకీయ రంగ ప్రవేశం గురించి నా నిర్ణయాన్ని వినడానికి కొన్ని గంటలే ఉంది. మీరంతా నా రాజకీయ రంగప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు. మన జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. హోదా, డబ్బు, పేరు.. ఇలా అన్ని అశాశ్వతమైనవే. అన్నింటి కంటే సమయం ఎంతో విలువైనది. నిన్న శివాజీగణేషన్, నేడు నేను.. రేపు మరొకరు.. అంటూ ప్రసంగించాడు. ఇక తన అభిమానులు తన ఆశీర్వాదం కోసం తన పాదాలను తాకే పని మానివేయాలని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ముద్దాడాలి. అంతేకాదు... డబ్బు,హోదా, క్రేజ్, ఇమేజ్, అధికారం ఉన్నవారికి వంగి నమస్కారాలు చేయడం, వారి ముందు సాగిల పడటం మానుకోవాలి అని చెప్పారు.
ఇక ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్‌తో నిర్వహిస్తున్న ఫొటో సెషన్స్ జరుగుతున్న రాఘవేంద్ర స్వామి కళ్యాణమండపంలో మాంసాహారం నిషిద్దం. దాంతో రజనీ తన అభిమానులకు భారీ నాన్ వెజ్ విందు ఇవ్వనున్నాడు. మరోవైపు రజనీ రాజకీయ ఎంట్రీని కాంగ్రెస్, బిజెపిలు రెండు స్వాగతించాయి. తమిళనాడులో త్వరలో సరైన ప్రత్యామ్నయం రజనీ ద్వారా వస్తుందని వారు స్పందించారు.