సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రీ టీజర్‌ని వదలడం మనం ప్రభాస్ నటిస్తోన్న 'సాహో'లో చూశాం. ఇప్పుడు అదేదారిలో బాలకృష్ణ కూడా నడుస్తున్నాడు. బాలకృష్ణ త్వరలో తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ని తేజ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి బాలకృష్ణ, సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి నిర్మాతలుగా ఉంటారు. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ఓ టీజర్‌ని రూపొందించాలని బాలయ్య భావించాడు. దాంతో ఆ విషయం సీక్రెట్‌గానే ఉంచాడు. కానీ ఆ యూనిట్‌లోని ఓ వ్యక్తి అత్యుత్సాహం కారణంగా అది అందరికీ తెలిసిపోయింది.
ఇక తాజాగా ఈ టీజర్ ఎలా ఉంటుంది? అనే విషయంలో ఎంతో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ టీజర్‌ని నాటి ఎన్టీఆర్‌కి చెందిన కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తూ, ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చినప్పుడు ఓ మెటాడోర్ వ్యానుని ప్రచారరథం కింద వాడుకున్నాడు. నాడు దానికి చైతన్య రథం అని పేరు పెట్టాడు. దీని తర్వాతనే రాజకీయ నాయకులు అందరూ పాదయాత్రలు, వాహనాలలో రోడ్‌షోలు మొదలుపెట్టారు. ఈ చైతన్యరథం ఇప్పటికీ రామకృష్ణా స్టూడియోస్‌లో ఉంది. దానికి నాడు హరికృష్ణ డ్రైవర్‌గా చేశాడు. బాలయ్య కూడా నాడు ఆ చైతన్యరధం మీదనే ప్రచారం కూడా చేపట్టాడు. ఆ చైతన్య రథంని చూపిస్తూ, నాడు ఎన్టీఆర్ వేసుకున్న ఖాకీ డ్రస్‌లో బాలకృష్ణ 'ఆరుకోట్ల ఆంధ్రులకు, సోదర సోదరీమణులు, ఆడపడుచులకు' అనే డైలాగ్‌ని వినిపిస్తూ, వెనుక వైపు నుంచి బాలకృష్ణ.. ఎన్టీఆర్‌లా కాషాయపు డ్రస్‌లో కనిపించే సీన్ మాత్రమే టీజర్‌లో ఉండనుంది. దీనిని జనవరి 18న విడుదల చేయనున్నారు. మరోవైపు రాంగోపాల్‌వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్', కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంధం' చిత్రాలపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాకపోవడంతో వాటిని ఏమైనా ఆపేశారా? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.