ప్రతి ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఇల్లు, పేరు, సినిమా ఓపెనింగ్, బిరుదులు, రిలీజ్ డేట్‌ల వంటివి సినీ జనాలలో ఎక్కువగా ఉంటాయి. ఇక మహేష్‌బాబుకి సినిమా ప్రారంభోత్సవానికి రాకూడదనే సెంటిమెంట్, కోడిరామకృష్ణకి తలకి గుడ్డ కట్టుకునే సెంటిమెంట్, కె.విశ్వనాథ్‌కి తన చిత్రాల టైటిల్స్ 'స'తో, భార్గవ్ ఆర్ట్స్‌కి 'మ'తో ప్రారంభమయ్యే సెంటిమెంట్లు ఉన్నాయి.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం మాటల మాంత్రికునిగా, స్టార్ రైటర్, డైరెక్టర్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ స్టేటస్‌ని అనుభవిస్తున్నాడు. కానీ ఆయన హైదరాబాద్‌కి వచ్చిన మొదట్లో సునీల్, ఆర్‌పి పట్నాయక్‌లతో కలిసి పంజాగుట్టలోని సాయిబాబా గుడి వద్ద ఒక్క చిన్న గదిలో ఉండేవాడు. పూట గడవడం కోసం ఎందరికో ఘోస్ట్‌గా పనిచేశాడు. ట్యూషన్లు చెప్పేవాడు. ఆ గదిలో ఉంటూనే 'స్వయంవరం'తో తానే రచయిత అయ్యాడు. తర్వాత 'నువ్వే.. నువ్వే' చిత్రం నుంచి టాప్ డైరెక్టర్ల స్థాయికి ఎదిగాడు.
అద్దె కట్టలేక, తిండి తినడానికి డబ్బులు లేని జీవితం కూడా గడిపాడు. కానీ ఆయన ఇప్పుడు ఎంత స్టార్‌గా ఎదిగినా కూడా ఆ అద్దె ఇంటిని మాత్రం వదులుకోలేదు. ఇప్పటికీ దానిలో ఎవ్వరూ ఉండకపోయినా ప్రతి నెలా ఐదు వేలు అద్దె కడుతూ, తన ఖాళీ సమయంలో ఆ రూమ్‌కి వెళ్లడం, అక్కడే తన కథను, మాటలను రాయడం ప్రారంభిస్తూ ఉంటాడు. అలా ఆయనకు తాను అద్దెలో ఉన్న గదే ఇప్పటికీ తీపి జ్ఞాపకంగా, సెంటిమెంట్‌గా మారింది.