అల్లరినరేష్ రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా కామెడీ హీరోగా ఓకే అనిపించుకున్నాడు. ఆయన చిత్రాలంటే సేఫ్ ప్రాజెక్ట్స్‌గా నిర్మాతలు, బయ్యర్లు ఫీలయ్యేవారు. ఇక ఇవివి సత్యనారాయణ ఉన్నంత కాలం అల్లరినరేష్ చిత్రాల ఎంపికలో సమతూకం కనిపించేది. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన పరిస్థితి తారు మారైంది. ఆయన కూడా స్ఫూఫ్‌లతో కాలం గడిపేశాడు. నేడు కామెడీ అంటే బుల్లితెరపై కూడా 'జబర్దస్త్, పటాస్' వంటి షోలు బోలెడు వస్తున్నాయి. దాంతో స్పూఫ్‌లకి కాలం చెల్లిందనే భావించాలి. ఇక 'సుడిగాడు' చిత్రమైతే అల్లరినరేష్‌కి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 'బెండు అప్పారావు, కితకితలు, బ్లేడ్ బాబ్జీ, గమ్యం' వంటి హిట్స్ నరేష్‌కి ఉన్నా కూడా 'సుడిగాడు' మాత్రం ఆయనకు మైల్‌స్టోన్‌గా నిలిచింది. ఈ చిత్రం'తమిళ పదం' అనే చిత్రానికి రీమేక్.
ఇక ఇందులో 100 చిత్రాలకు సమానమైన స్ఫూఫ్ లని అల్లరినరేష్ - భీమినేని శ్రీనివాసరావులు అందించారు. కానీ ఈ చిత్రం తర్వాత అల్లరినరేష్‌కి ఒక్క హిట్ కూడా లేదు. దానికితోడు భీమనేనికి కూడా ఆ చిత్రం మేలు కంటే కీడే ఎక్కువ చేసింది. ప్రేక్షకులు ఆ స్థాయి అంచనాలతోనే సినిమా థియేటర్లకు వెళ్తుండటం అల్లరోడు కెరీర్‌ని దెబ్బతీసింది. ఇటీవల అల్లరినరేష్ 'సెల్ఫీరాజా, మేడమీద అబ్బాయి' అంటూ రెండు రీమేక్‌లు చేసినా యావరేజ్ కూడా కాలేదు. ఇక ప్రస్తుతం తమిళంలో 'సుడిగాడు' మాతృక 'తమిళపదం'కి సీక్వెల్ తయారవుతోంది. దీంతో రీమేక్‌లకి రవిరాజా పినిశెట్టి తర్వాత స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రం తమిళంలో ఇంకా రిలీజ్ కాకుండానే భారీ మొత్తానికి రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. దాంతో ఈసారి 'సుడిగాడు 2'లో అల్లరినరేష్‌తో పాటు ఫ్లాప్‌లలో ఉన్న మరో హీరో సునీల్‌ని కూడా కలిపి ఈ చిత్రాన్ని భీమనేని ప్లాన్ చేస్తున్నాడు.
తాజాగా విడుదలైన సునీల్ చిత్రం '2 కంట్రీస్' చిత్రం కూడా సో..సో అనిపిస్తోంది. దాంతో ఈ ఇద్దరు ఫ్లాప్ కమెడియన్లను కలిపి సినిమా చేస్తే బాగానే వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంది. మరో వైపు ఈ చిత్రం కోసం పెద్ద రెమ్యూనరేషన్ అయినా ఫర్లేదని భీమనేని రకుల్‌ప్రీత్‌సింగ్, లావణ్యత్రిపాఠి వంటి వారిని సంప్రదిస్తున్నారట. తాజాగా '2 కంట్రీస్' నిర్మాత, దర్శకుడు శంకర్ సునీల్ సరసన మన హీరోయిన్లు నటించడానికి ఒప్పుకోలేదని, ఆయనతో నటిస్తే తమ కెరీర్‌కి ఇబ్బంది అని చెప్పారని బాధపడ్డాడు. మరి 'సుడిగాడు 2' కి స్టార్ హీరోయిన్స్ ఒప్పుకుంటారో? లేదో ? వేచిచూడాల్సివుంది..!