నేటి రోజుల్లో హిట్ టాక్, పాజిటివ్ టాక్ రావడమే గగనమైపోయింది. అలాంటిది కొన్ని చిత్రాలకు మంచి టాకే వచ్చినా థియేటర్ల వద్ద ప్రేక్షకులు కనిపించడం లేదు. రామ్ నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ', రాజశేఖర్ నటించిన 'పీఎస్వీగరుడవేగ' చిత్రాలకు మంచి టాకే వచ్చింది. అందునా రామ్ నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రం రామ్‌తో 'నేను శైలజ'తో పెద్ద హిట్ కొట్టిన కిషోర్ తిరుమల కాంబినేషన్.. అందులోనూ ఎంతో అనుభవం ఉన్న స్రవంతి రవికిషోర్‌లు కూడా ఈ చిత్రానికి సరైన కలెక్షన్లు రాబట్టేలా చేయలేకపోయారు. ఇక 'పీఎస్వీగరుడవేగ'కి దాదాపు ఇండస్ట్రీ మొత్తం బాగుందని ప్రమోట్ చేసింది. అందునా సినిమా ఫీల్డ్‌లో ఎంతో అనుభవం ఉన్న రాజశేఖర్, జీవితలు ఉన్నా కూడా ఈ చిత్రం సేఫ్ జోన్‌లోకి రాలేకపోయింది.
ఇక తాజాగా ఒక రోజు గ్యాప్‌లో నాని 'ఎంసీఏ', అక్కినేని అఖిల్ నటించిన 'హలో' చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు పోటీ లేకపోయినా కూడా 'ఎంసీఏ' వల్ల 'హలో'కి కాస్త కలెక్షన్లు తగ్గాయని, సినిమా హిట్, ఫ్లాప్‌లు, కలెక్షన్లను పక్కనపెడితే ఈ చిత్రం తనకు మంచి పేరును తెచ్చిందని అఖిలే స్వయంగా చెప్పాడు. టాక్ కూడా బాగానే ఉన్నా, ప్రమోషన్స్ భారీగానే చేసినా ఈ చిత్రం మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాలలో 11 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అది కూడా నైజాం ఏరియాలో మంచి కలెక్షన్లు సాధించినా, ఆంధ్రా, రాయలసీమలలో కలక్షన్లు చాలా సాదాసీదాగా ఉన్నాయి. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియేటికల్ రైట్స్ 32 కోట్లకు అమ్ముడుపోయాయి.
మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 16కోట్ల షేర్‌ని మాత్రమే సాధించింది. అంటే మొత్తం థియేటికల్ రైట్స్‌లో కేవలం సగం మాత్రమే రాబట్టింది. ఇక ఈ వారం కూడా 'హలో'కి పోటీగా వచ్చే చిత్రాలేమీ లేవు. అయినా ఈ చిత్రం ఇంకా హిట్ స్థాయిలో నిలబడాలంటే మరో 16కోట్లు రాబట్టాల్సి వుంది. మరి అది సాధ్యమయ్యే పనేనా? లేక హిట్ టాక్.. బ్యాడ్ కలెక్షన్ల కిందకి ఈ చిత్రం కూడా చేరుతుందా? అనేది తేలాల్సివుంది...!