ఆమె సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పుడు ఒక్కసారి కూడా డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నించలేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా అరువు గొంతుతోనే డబ్బింగ్ చెప్పించుకున్న ఆ హీరోయిన్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత మాత్రం డబ్బింగ్ కు సై అంటోంది. ఆమె ఎవరో కాదు ఎంసీఏ సినిమాలో నాని కి వదినగా నటించిన భూమిక. ఎంసీఏ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన భూమిక.. కుదిరితే ఇకపై సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటానంటోంది.
తాను కేరెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఎంసీఏ సినిమా గురించి మాట్లాడుతూ భూమిక తన మనసులోని కోరికను బయటపెట్టింది. అదేమిటంటే ఎంసీఏ సినిమా నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పలేకపోయినా, నా నెక్ట్స్ సినిమా సవ్యసాచిలో మాత్రం సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటాను. నిజానికి నాకు తెలుగు బాగావచ్చు. కాకపోతే మాట్లాడేటప్పుడు గ్రామర్ మిస్టేక్స్ వస్తాయని భయం. అదే గనక ఎవరైనా గైడ్ చేస్తే అద్భుతంగా డబ్బింగ్ చెబుతా ఇలా డబ్బింగ్ పై తన అభిప్రాయం చెప్పేసింది భూమిక.
ఈ మధ్యకాలంలో పరభాషా హీరోయిన్లంతా సొంతంగా తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. రాశిఖన్నా, అను ఎమ్మాన్యుయేల్, కీర్తిసురేష్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్స్ .. చాలామంది సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి నటి భూమిక కూడా చేరింది.