సినిమా అనేది ఓ చిత్రవిచిత్ర ప్రపంచం. ఇందులో ఒక హీరో సరసన నటించిన హీరోయిన్లే వారికి ఆ తర్వాత అక్క, వదిన వంటి పాత్రలు చేస్తుంటారు. లేదా వారి వారసులకి తల్లితండ్రి పాత్రల్లో నటిస్తూ ఉంటారు. పాత కాలంలో అయితే శ్రీదేవి వంటి వారు ఏయన్నార్‌కి జోడీగా నటించి, ఆయన కుమారుడు నాగార్జున సరసన కూడా హీరోయిన్‌గా నటించారు. జెడి చక్రవర్తి హీరోగాచేసిన చిత్రాలలో రవితేజ చిన్న పాత్రలు పోషించాడు. అదే రవితేజ హీరోగా నటించిన 'దుబాయ్‌శ్రీను'లో జెడి ఓ చిన్న పాత్ర చేశాడు.
ఇక విషయానికి వస్తే జగపతిబాబు నటించిన 'సముద్రం, బడ్జెట్ పద్మనాభం' చిత్రాలలో హీరోగా జగపతిబాబు చేస్తే అందులోని చిన్న పాత్రలను రవితేజ చేశాడు. కానీ కాలం మారింది. ఓడలు బళ్లయ్యాయి... బళ్లు ఓడలయ్యాయి... నేడు రవితేజ దాదాపు స్టార్ హీరో కింద లెక్క. ఇక హీరోగా తన కెరీర్‌ని వదిలేసి ఏదో అప్పుడప్పుడు 'జగ్గుబాయ్' వంటివి చేస్తూ 'లెజెండ్'లో పవర్‌ఫుల్ విలన్‌గా జగపతిబాబు చేశాడు. ఆ తర్వాత ఆయనకు వరుసగా విలన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళం, మలయాళంలో కూడా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. దాంతో తనకు హీరోగా కంటే ఆర్దికంగా, వృత్తిపరంగా ఇప్పుడే బాగుందని జగపతిబాబు అంటున్నాడు.
మరోవైపు ఆయనకు 'లెజెండ్' తర్వాత కొన్ని పవర్‌ఫుల్ చిత్రాలు వచ్చినా,'శ్రీమంతుడు' తరహాలో సాఫ్ట్ పాత్రలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయనకు మరోసారి హీరోతో పోటాపోటీగా ఉండే పవర్‌ఫుల్ విలన్ పాత్ర వచ్చింది. రవితేజ ప్రస్తుతం విక్రమ్ సిరికొండ అనే నూతన దర్శకునితో 'టచ్ చేసి చూడు' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే నెల విడుదల కానుంది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని 'సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రాలతో రెండు వరుస హిట్లు కొట్టిన కురసాల కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. శ్రీనువైట్ల సినిమా కంటే ముందుగానే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. జనవరి 5వ తేదీన ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది.
ఇక ఈ చిత్రం కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా, రవితేజ స్టైల్‌లో ఉండనుంది. అందుకే 'నేల టిక్కెట్' అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశారు. హీరోయిన్‌గా మాళవిక శర్మ పరిచయం కానుండగా, పవర్‌ఫుల్ విలన్ పాత్రలో జగపతిబాబుని తీసుకున్నారని సమాచారం. మరి ఈ చిత్రంతో కళ్యాణ్‌కృష్ణ హ్యాట్రిక్ కొడతాడా? అనేది వెయిట్ చేయాలి. మొత్తానికి ఇద్దరు గడ్డాల నటులు ఒకరినొకరు ఢీ కొట్టనున్నారన్నమాట...!