సాధారణంగా హీరోలు స్టార్స్‌గా మారిన తర్వాత అభిమానులతో వారు ప్రవర్తించే తీరు కూడా మారిపోతుంది. తామేదో స్వర్గం నుంచి ఊడిపడ్డామని భావిస్తూ ఉంటారు. కెరీర్ మొదట్లో అందరికీ గౌరవం ఇచ్చి, ఫోటోలు తీసుకుంటూ, చిన్నపత్రికలకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తారు. ఒక్కసారి స్టార్స్‌గా మారిన తర్వాత వారు తమ పరిధిని తగ్గించుకుని, అదే లోకంగా బతుకుతుంటారు. ఎవరైనా అభిమాని ఫొటో అడిగినా, సెల్ఫీ అడిగినా విసుక్కుంటారు. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారైతే అభిమానులను కొట్టినంత పని చేస్తారు. ఈ విషయంలో జూనియర్ కాస్త మారాడు గానీ బాలయ్య వంటి వారు ఇంకా మారలేదు.
మరోవైపు తాము కెరీర్‌స్టార్టింగ్ స్టేజీలో చిన్న పత్రికలు, ఛానెల్స్, యూట్యూబ్‌లకు కూడా ఇంటర్వ్యూ ఇస్తారు. రమ్మంటే స్టూడియోకి వచ్చి లైవ్‌లో కూడా చాట్ చేస్తారు. కానీ ఒక్కసారి స్టార్ హోదా వచ్చిన తర్వాత వారి వద్దకే కెమెరాలు ఎత్తుకెళ్లాలి. ఎంత కష్టమైనా వారు చెప్పిన చోటికే వెళ్లితేనే ఇంటర్వ్యూ ఇస్తారు. మరికొందరైతే ఇంత మంది మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఎందుకని భావించి తామే ఎవరితోనే ఓ ఇంటర్వ్యూ రికార్డు చేయించి, అవే వీడియోలను ప్రతి ఛానెల్‌కి ఒకే వాటిని పంపిస్తుంటారు. ఈ కోవలోకి అల్లుఅర్జున్ కూడా చేరుతాడు. అభిమానులను తిట్టడం, విసుక్కోవడంలో కూడా ఆయనది అందె వేసిన చేయి.
తాజాగా ఇదే విషయమై అల్లుశిరీష్‌ని మీరు కోపంతో, బాధతో ఉన్నప్పుడు ఎవరైనా సెల్ఫీ అడిగితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అనే ప్రశ్న ఎదురైంది దానికి ఆయన సమాధానం చెబుతూ, నాకు చిరంజీవి గారు ఓ మాట చెప్పారు. నువ్వు రేపు హీరోవి అయిన తర్వాత నిన్ను ఎవరెవరో కలుస్తుంటారు. పలకరిస్తుంటారు. నీకు వారు ఆ క్షణంలో తప్ప మరోసారి గుర్తుండకపోవచ్చు. ఆ తర్వాత వారికి మరలా నిన్ను కలిసే అవకాశం లభించకపోవచ్చు. కాబట్టి ఏ మూడ్‌లో ఉన్నా కూడా అభిమానులు వచ్చి ఫొటోలు అడిగినా, ఆటోగ్రాఫ్‌లడిగినా ఇవ్వు. వారు జీవితాంతం అల్లుశిరీష్ మనల్ని ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు... ప్రవర్తించాడు అని వాటిని తీపి జ్ఞాపకాలుగా మిగుల్చుకుంటారు.. అని చెప్పారు. ఆ మాట నన్ను ఎంతో ఆలోచింపజేసింది. కాబట్టి సెల్ఫీ ఇవ్వడాన్ని అదృష్టంగా భావిస్తాను. అందుకే నవ్వుతూ సెల్ఫీ ఇస్తానని చెప్పుకొచ్చాడు.
ఈ విషయంలో చిరంజీవికి వీరాభిమానులు ఏర్పడడానికి కారణం కూడా ఇదే. ఆయన ఏ మూడ్‌లో ఎక్కడ ఉన్నా కూడా అభిమానులు కోరుకుంటే వెంటనే వారితో ముచ్చటించి, కాసేపు వారితో ఫొటోలు దిగి ఆప్యాయంగా పలకరిస్తాడు. మరి మనసులో ఏమనుకుంటాడో? లేక అభిమానుల ముందు నటిస్తాడో తెలియదు గానీ ఆయన అభిమానులను ఎప్పుడు డిజప్పాయింట్ చేయడు. కాబట్టి శిరీష్ లాగా ఆయన అన్న బన్నీ కూడా ప్రవర్తిస్తే బాగుంటుంది.