నేడు ప్రతి రంగంలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని, కొత్తవారిని, చిన్నవారిని, చిన్నచిత్రాలను ఎంకరేజ్ చేయాలని మన సినీ పెద్దలు ఏవేవో నీతులు చెబుతుంటారు. తాము కొత్తవారిని పరిచయం చేశామని, వారి ఎదుగుదలకు దోహదం చేశామని, కానీ వారే ఇప్పుడు తమ పట్ల కనీస మర్యాద, తమతో పనిచేయమంటే నో అని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఉదాహరణకు చిరంజీవి విజయంలో విజయబాపినీడు, కోదండరామిరెడ్డి, కె.యస్.రామారావు, యండమూరి వీరేంద్రనాథ్, ఆయన స్నేహితులైన కమెడియన్ సుధాకర్, నారాయణరావు, ప్రసాద్ బాబు, దేవి వరప్రసాద్ ఇలా ఎందరో ఎంకరేజ్‌మెంట్ ఉంది.
ఇక బాలకృష్ణకి కోడిరామకృష్ణ, భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్.గోపాల్‌రెడ్డి వంటి వారు ఉన్నారు. నాగార్జునకి శివప్రసాద్‌రెడ్డి ఇచ్చిన తోడ్పాటు అంతా ఇంతాకాదు. కానీ వారు ఇప్పుడు ఎదిగిన తర్వాత వారిని గుర్తుపెట్టుకుంటారా? అంటే లేదనే చెప్పాలి. ఇక్కడ సినీ ఫీల్డ్ అనేది డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఎవరిని ఎవరు ఊరకనే ఎంకరేజ్ చేయరు. లోపల ఏదో స్వార్ధం దాగి ఉంటుంది. ఇక విషయానికి వస్తే తమిళనాడులో ప్రముఖ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ పొన్‌రామ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తాను 50 చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. అందులో 45 చిత్రాలు చిన్న చిత్రాలే. ఆయా చిత్రాలను థియేటర్లలో ప్రదర్శిస్తే కనీసం పట్టుమని పదిమంది ప్రేక్షకులు కూడా రావడం లేదు. దాంతో మాకు ఏసీ ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. స్టార్ విజయ్ కూడా ఒకప్పుడు చిన్న చిత్రాలు చేసిన వాడే. నాడు ఆయనకు థియేటర్లను ఇచ్చి మేమే ఆయన్ను సూపర్‌స్టార్‌ని చేశాం.. అని వ్యాఖ్యానించారు.
ఆయన చెప్పింది నిజమే గానీ, పాతకాలంలో సినిమా బాగుంటే ఎవరు నటించారు అని ఆలోచించకుండా థియేటర్లకు జనాలు వచ్చేవారు. ప్రతి హీరో సినిమాకి ఓపెనింగ్స్ ఉండేవి. కానీ ఈమధ్య స్టార్స్ చిత్రాలకు మొదటి వీకెండ్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ భారీగా టిక్కెట్ల రేట్లు పెట్టి, ప్రేక్షకులను నిలువునా దోస్తున్నారు. ఆ మొత్తం నిర్మాతలకు గానీ ప్రభుత్వాలకు గానీ చేరడం లేదు. దాంతో పాటు సినిమా స్థానంలో పలు వినోద సాధనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి చిత్రానికి వేలల్లో ఖర్చుపెట్టి కుటుంబసమేతంగా చూసే రోజులు పోయాయి. కేవలం స్టార్స్ చిత్రాలకు మాత్రమే థియేటర్లకు వస్తూ, చిన్న సినిమాలను పైరసీ రూపంలోనో, లేక శాటిలైట్ ఛానెల్స్‌లో ప్రదర్శితమయినప్పుడు చూస్తున్నారు. కాబట్టి విజయ్‌ని ఊరికినే ఎలాంటి స్వార్ధం లేకుండా ఎగ్జిబిటర్లు ఎంకరేజ్ చేసి సూపర్‌స్టార్‌ని చేయలేదు. ఈ విషయంలో నిర్మాతల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల వరకు అందరి తప్పు ఉంది.