పాతకాలం నటీమణుల్లో సావిత్రిని తీసుకుంటే ఆమె ఎన్టీఆర్, ఏయన్నార్‌లతోనే కాదు పలువురి సరసన నటించింది. పద్మనాభంకి భార్యగా కూడా యాక్ట్ చేసింది. ఇక 'రక్తసంబంధం' చిత్రంలో ఎన్టీఆర్‌కి చెల్లెలిగా నటించింది. జమున కూడా ఎన్టీఆర్, ఏయన్నార్‌లతో నటిస్తూనే జగ్గయ్య, హరనాథ్, అప్పుడప్పుడే పైకి వస్తున్న కృష్ణంరాజు, కాంతారావు వంటి వారితో కూడా యాక్ట్ చేసింది. శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి వారు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో పాటు చంద్రమోహన్‌తో సహా ఎందరో చిన్న హీరోల సరసన నటించాడు. నిన్నటితరంలో సౌందర్య, రమ్యకృష్ణ, రంభ వంటి వారు కూడా స్టార్స్‌తో నటిస్తూనే బాబూమోహన్‌తో చిందేశారు. మీడియం హీరోలైన శ్రీకాంత్, జగపతిబాబు వంటి వారితో కూడా నటించారు. కానీ అలాంటి వాతావరణం ఇప్పుడులేదు. దానికి కారణం కొంతమేరకు ఫిల్మ్‌మేకర్స్‌ది కూడా తప్పు ఉంది. సీనియర్ స్టార్స్‌తో నటించే హీరోయిన్లను యంగ్‌స్టార్స్ చిత్రాలలోకి తీసుకోవడం లేదు. ఇక స్టార్స్‌తో నటించే వారు సునీల్, అల్లరినరేష్ వంటి వారితో నటిస్తే వారిని పక్కన పెట్టేస్తున్నారు. ఈ ఇబ్బందే సునీల్ తాజా చిత్రం '2 కంట్రీస్'కి కూడా ఎదురైందని దర్శకనిర్మాత శంకర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ చిత్రంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే మనీషారాజ్, సంజనలను పెట్టుకున్నామని తెలిపాడు. ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. దాంతో ఇక్కడి చాలా మంది హీరోయిన్లని అప్రోచ్ అయ్యాం. కానీ వారు డేట్స్ కుదరవని కొందరు, ఇంట్రస్ట్ లేదని కొందరు చెప్పారు. మరికొందరైతే సునీల్ సరసన నటిస్తే తమ స్థాయి పడిపోతుందని నో చెప్పారు. బయట మాత్రం మంచి పాత్రలు రావడం లేదు అని స్టేట్‌మెంట్స్ ఇస్తుంటారు. మంచి పాత్రను ఇస్తే చేయడానికి సాహసించలేకపోతున్నారు. ఇక చిన్న హీరోలతో నటిస్తే ఆల్‌రెడీ స్టార్స్ సరసన నటించిన తమకు డిమాండ్‌తో పాటు రెమ్యూనరేషన్ కూడా తగ్గుతుందనేది వారి భావన. ఇది నాకెంతగానో బాధని కలిగించిందని చెప్పుకొచ్చాడు.