ఎవరు ఎన్ని విధాలుగా కవరింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా పవన్ అభిమానుల తీరు మాత్రం రోజు రోజుకి విపరీత పోకడలు పోతోంది. ఇటీవల 'సినీజోష్'లోనే 'నాయక్' యావరేజ్ మూవీ అని రాసినందుకు మెగాభిమానులు పచ్చి బూతులు తిడుతూ, నరుకుతాం.. చంపుతాం అంటూన్నారు. దీనిని చూస్తే మెగాభిమానులంతా ఇంతేనా అనిపించకమానదు. ఇక విషయానికి వస్తే మొదట్లో పవన్‌ని రాజకీయాలలోకి రమ్మని పిలుపునిచ్చిన మొదటి వ్యక్తి రాంగోపాల్ వర్మే. వర్మ పవన్‌ని పొగిడినా, తిట్టినా కూడా దానికో రీజన్ ఉంటుంది. తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని కామెంట్ చేయడం, మంచి చేసినప్పుడు ఇది మంచి అని చెప్పడం విమర్శకుల పని, ఓ వ్యక్తిని ఒకసారి మంచిగా పొగిడామంటే ఇక ఆ వ్యక్తి తప్పు చేసినా కూడా పొగడాల్సిన అవసరం లేదు. పవన్ ఒకవైపు తప్పుంటే ప్రశ్నించండి.. ప్రశ్నించడానికే వచ్చాను అంటున్నాడు. కానీ అదే వేరే వారు ఆయన్ను ప్రశ్నిస్తే మాత్రం ఆయన అభిమానులు ఊరుకోవడం లేదు. అంటే పవన్ ఏది ప్రశ్నించినా కరెక్ట్.. ఇతరులు పవన్‌ని ఏమి ప్రశ్నించినా తప్పు అనే ధోరణి పవన్ అభిమానుల్లో కనిపిస్తోంది.
ఇందులో పవన్ తప్పేమి లేకపోయినా ఆయన ఫ్యాన్స్ చేస్తున్న దౌర్జన్యాలు, బూతు కామెంట్స్, నరుకుతాం.. చంపుతాం అని బెదిరించడం చూస్తే తన అభిమానులకు దిశానిర్దేశం చేసి, అభిమానులను కంట్రోల్‌లో పెట్టడం చేత కాదేమో అనిపిస్తోంది. అంటే ఆయన కేవలం తన అభిమానులనే కంట్రోల్ చేయలేని వాడు.. తనను ఎవరు చిన్నమాట, విమర్శ చేసినా తట్టుకోలేని వాడు రేపు రాజకీయాలలోకి వచ్చి ప్రజలందరినీ సమానంగా ఎలా చూడగలడు? ఎలా తన కార్యకర్తలని, ఇతరులను కంట్రోల్‌లో పెట్టగలడు? అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది.
ఇక వర్మ.. పవన్ వృత్తి అయిన సినిమా, ఆయన రాజకీయాలపై స్పందించాడే గానీ పవన్ వ్యక్తిగత జీవితం, ఆయన ముగ్గురు పెళ్లాల విషయం ఎప్పుడు మాట్లాడలేదు. కానీ పవనే వర్మ విషయంలో తొందరపడి 'పెళ్లయిన అమ్మాయి ఉండగా, పోర్న్ వీడియోలు కలెక్ట్ చేసే అతను మనిషా' అని వ్యక్తిగత విమర్శలకు దిగాడు. మరి పవన్ ఇతరుల వ్యక్తిగత జీవితాలను, ఆయన అభిమానులు కూడా వ్యక్తిగత బెదిరింపులు, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిగ్గా పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడని వారు కూడా ఆ విషయాలను ప్రశ్నించాల్సి వస్తుంది.
ఇక తాజాగా పవన్ అభిమానులు, పవన్‌ని టార్గెట్ చేసిన కత్తి మహేష్ బీర్ తాగుతున్న ఫొటోలను వైరల్ చేస్తున్నారు. అసలు కత్తి మహేష్ బీరు తాగితే పవన్ అభిమానులకు ఎందుకు? అదేమీ డ్రగ్స్‌లాగా నిషేధిత వస్తువు కాదు.. కత్తి మహేష్ ఏమీ రాజ్యాంగపరంగా నేరం చేయలేదు. దాంతో కత్తి మహేష్‌కి కూడా బాగా మండింది. నేను ఇప్పటివరకు సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా మాత్రమే పవన్‌పై విమర్శలు చేశాను. ఇక నుంచి పవన్ అభిమానులే నన్ను ఆయన వ్యక్తిగత విషయాలపై కూడా కామెంట్స్ చేసే పరిస్థితిని కల్పించారు అని మండిపడ్డాడు. ఇక్కడ కత్తి మహేష్ వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది.
పవన్ మూడు పెళ్లిళ్లు, రేణుదేశాయ్, వారికి పుట్టిన పిల్లలు.. ఇలా పవన్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి పవన్ జీవితంలో కూడా ఎన్నో లొసుగులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయానికి ఇక్కడితోనైనా ఫుల్‌స్టాప్ పెట్టడం అభిమానులకు, ముఖ్యంగా తన ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం పవన్‌పైనే ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఇది పెద్ద వివాదానికే కారణమవుతుందని చెప్పాలి...!