ఇటీవలి కాలంలో హాలీవుడ్‌లో నిర్మాత హార్వే వీన్‌స్టెన్ పలువురు హాలీవుడ్ నటీమణులతో పాటు ఇతర దేశాల నటీమణులపై కూడా లైంగిక వేదింపులకు పాల్పడిన సంగతి బయటికి వచ్చింది. మరోవైపు మలయాళనటిపై కిడ్నాప్, అత్యాచారం ఘటన కూడా వెలుగులోకి రావడంతో ఇప్పుడు మన వారు కూడా ముందుకొచ్చి ఇలాంటి వాటిని తాము కూడా అనుభవించామని మీటూ హ్యాష్‌ట్యాగ్‌ని వాడుతున్నారు. తాజాగా ప్రియంకా చోప్రా కూడా దీనిపై స్పందించింది.
నేను లైంగిక వేధింపులు ఎదుర్కోలేదు గానీ కొందరి అధికార దాహానికి మాత్రం బలయ్యాను. అయినా మొండిగా పోరాడాను. మొదట నన్ను తీసుకుని అగ్రిమెంట్ కూడా పూర్తయిన తర్వాత చివరి క్షణంలో నన్ను సినిమాలోంచి తప్పించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వేరే వారి సిఫార్సుల వల్ల నా స్థానంలో వారిని పెట్టుకునే వారు. ఆ సమయంలో నేనేమీ చేయని పరిస్థితి. కేవలం నా సన్నిహితులు, స్నేహితులు, సహచరుల ప్రోత్సాహం వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నాను. మనం ఆచార వ్యవహారాల ప్రకారం నడుచుకుంటూ ఉంటే మంచిది. వాటిని మనం గౌరవించాలి.
ఇక అమెరికన్ ప్రెసిడెంట్ తనను వేధించాడని హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీవ్ దైర్యంగా బయటపెట్టడమే కాదు.. వైట్ హౌస్ ముందు ఆయనకు వ్యతిరేకంగా కొన్ని వస్తువుల అమ్మకాలను కూడా పెట్టి తమ నిరసనను తెలిపారు. కానీ మనదేశంలో అయితే ఆ పరిస్థితి లేదు. అయినా భవిష్యత్తు తరాలకు మహిళలను గౌరవించడం నేర్పడం ద్వారానైనా మార్పు వస్తుందని భావిద్దాం... అని చెప్పుకొచ్చింది. ఇక ఆమె జీ అవార్డ్సు కోసం ఐదు నిమిషాలు డ్యాన్స్ చేసినందుకు ఐదు కోట్లు తీసుకుందని వార్తలపై ఘాటుగా మీడియాకు క్లాస్ పీకింది.
నేనెంతో కష్టపడి, ఇబ్బందులు పడి పైకి వచ్చాను. నా కష్టానికి తగ్గ ప్రతిఫలమే నేను తీసుకుంటాను. నాకిచ్చే చెక్‌లో ఎన్ని సున్నాలున్నాయో పట్టించుకోను. అన్ని సున్నాలకు నేను న్యాయం చేస్తున్నానా? లేదా? అనేది ఆలోచిస్తాను. మరి హీరోలను అంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని మీడియా ఎందుకు ప్రశ్నించదు? కేవలం మమ్మల్ని మాత్రమే ఇలా అడగటం ఏంటి? స్టార్ హీరోలకు సరిసమానంగా మేల్ డామినేట్ ఇండస్ట్రీలో కూడా ఇంతగా రెమ్యూనరేషన్‌ని తీసుకున్నందుకు సంతోషించాలి కానీ మా మీదనే విమర్శలు చేస్తారా? అంటూ క్లాస్ పీకింది.