అక్కినేని అఖిల్ రెండో చిత్రం 'హలో' ఈనెల 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు ముందు నాగార్జున బ్లాక్‌బస్టర్ పక్కా అన్నాడు. సినిమాకి పాజిటివ్ టాకే వచ్చినా అది బ్లాక్‌బస్టర్ కాదని తేలిపోయింది. కానీ అఖిల్ మొదటి చిత్రం 'అఖిల్' తో పోల్చుకుంటే మాత్రం ఎంతో బెటర్ అని ఫీలింగ్ కలిగిస్తోంది. అయినా 'హలో' చిత్రం పట్ల కూడా అక్కినేని ఫ్యాన్స్ పెద్దగా సంతృప్తికరంగా లేరు. ఇక తాజాగా అఖిల్ మాట్లాడుతూ, 'అఖిల్' చిత్రం కథ నేను ఒక్కడినే విని చేశాను. ఇందులో నాగార్జున పాత్ర ఏమి లేదు. ఆ చిత్రం రిజల్ట్‌కి నేనే బాధ్యుడిని. ఇక ఆ చిత్రం డిజాస్టర్ అయిన తర్వాత ఎంతో కాలం బయటికి రాలేదు. ఆ సినిమాని ఎన్నోసార్లు చూసి లోపం ఎక్కడ ఉందా? అని వెతికాను. ఇక విక్రమ్ కె.కుమార్ 'హలో' చిత్రం స్టోరీ విన్నప్పుడు మాత్రం రిలాక్స్‌గా ఫీలయ్యాను. ఈ చిత్రం చూసిన మా కుటుంబ సభ్యులే కాదు... ప్రేక్షకులు, ఫ్యాన్స్ కూడా నా ఫైట్స్, డ్యాన్స్, నటనలో ఇంప్రూవ్‌మెంట్ ఉందని ప్రశంసిస్తున్నారు.
ఇక 'హలో' చిత్రం విడుదలయ్యే ముందు రోజు రాత్రి ఎంతో టెన్షన్ పడ్డాను. రాత్రి నిద్ర కూడా పట్టలేదు. యూఎస్ నుంచి పాజిటివ్ టాక్ రావడం, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఆనందం వేసింది. ఇక నా 'హలో' చిత్రానికి, నాని 'ఎంసీఏ' చిత్రానికి ఎలాంటి పోటీ లేదు. రెండు చిత్రాలు హిట్టయినందుకు హ్యాపీగా ఉందని చెబుతూనే, 'ఎంసీఏ' వల్ల కలెక్షన్లు కాస్త తగ్గిన సంగతి వాస్తవమేనని, కలెక్షన్లు- హిట్ సంగతి పక్కనపెడితే మంచి చిత్రం చేశానన్న ఆనందం మాత్రం మిగిలిందంటూ కాస్త తగ్గినట్లుగా మాట్లాడాడు. ఇక ఈ చిత్రంలోని ఫైట్స్ అంత ఈజీకాదు. కానీ ముందుగానే నేను 'బాబ్ బోర్న్' అనే స్టంట్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. అందువల్లే సినిమాలో ఫైట్స్ ఈజీగా చేయగలిగాను అని చెప్పుకొచ్చాడు.
ఇక అఖిల్ మొదటి చిత్రం తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని రెండో చిత్రం 'హలో' చేశాడు. మరి ఆయన తదుపరి మూడో చిత్రానికి ఎంత టైం తీసుకుంటాడో అనే విషయమై మాట్లాడుతూ, ఈ సారి బ్లాక్‌బస్టర్‌తో రావాలని భావిస్తున్నాను. ఆల్‌రెడీ రెండు కథలు విన్నాను. మూడో చిత్రంగా ఎవరితో ఏ సినిమా అనేది జనవరి 10న తెలుపుతానని చెప్పాడు. ఇక ఇటీవల వరకు అఖిల్ మూడో చిత్రం విషయంలో కొరటాలశివ, సుకుమార్‌ల పేర్లు వినిపించాయి. ఇప్పుడు మాత్రం 'రాజు రాణి, మెర్శల్' దర్శకుడు అట్లీకుమార్ పేరు వినిపిస్తోంది. మరో వైపు అట్లీకుమార్ తదుపరి చిత్రం ప్రభాస్‌తో చేయనున్నాడని వార్తలు వస్తున్న నేపధ్యంలో అక్కినేని అఖిల్ మూడో చిత్రం ఏమిటో అన్న ఆసక్తి ఏర్పడింది. దీనికి సమాధానం కోసం వచ్చేనెల 10వ తేదీ వరకు వెయిట్ చేయాల్సివుంది...!