సునీల్ మంచి మాటకారి మాత్రమే కాదు.. ఎంతో లౌక్యం తెలిసిన వాడు. ఇక ఈయన మాటల మాంత్రికుడు, దర్శకుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ఆప్తమిత్రుడు. ఇద్దరు భీమవరంకి చెందిన వారే. ఒకేసారి సినిమాలలో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి పంజాగుట్టలో ఓ రూమ్‌లో ఉన్నారు. అదే రూమ్‌లో ఆర్‌పీ పట్నాయక్ కూడా ఉన్నాడు. ఇక త్రివిక్రమ్, సునీల్‌ల సినిమా కెరీర్ నుంచి పెళ్లి వరకు దాదాపు ఒకేసారి జరిగాయి. త్రివిక్రమ్ రచయితగా, దర్శకునిగా మారిన తర్వాత కూడా తన చిత్రాలలో సునీల్ కోసం హీరో స్నేహితుడు, అసిస్టెంట్ పాత్రలను స్పెషల్‌గా డిజైన్ చేయించేవాడు. ఇక సునీల్ కమెడియన్‌గా దూసుకుపోతున్న తరుణంలో హీరోగా మారాడు. మొదట్లో హీరోగా మంచి మార్కులే తెచ్చుకుని హిట్స్ సాధించాడు. ఇక తనకు రాజమౌళితో ఉన్న స్నేహంతో ఆయనతో 'మర్యాద రామన్న' చేసి హిట్ కొట్టాడు.
ఇక త్రివిక్రమ్ మాత్రం కావాలంటే సునీల్‌కి కామెడీ పాత్రలు రాశాడే గానీ అతను హీరోగా మాత్రం సినిమా చేయలేదు. ఇప్పుడు సునీల్ పరిస్థితి హీరో నుంచి జీరోగా మిగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్ తన చేతికి పదును పెట్టి మాటల మంత్రం చేస్తే సునీల్‌కి మరో హిట్ గ్యారంటీ అని చెప్పవచ్చు. కానీ త్రివిక్రమ్ పెద్ద సినిమాలు, స్టార్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇక 'అజ్ఞాతవాసి'లో కూడా ఓ కామెడీ క్యారెక్టర్‌ని త్రివిక్రమ్ సిద్దం చేసినా సునీల్ చేయలేదని వినిపిస్తోంది. ఇక సునీల్ ఇప్పుడు మాత్రం మనసు మార్చుకున్నాడు. ఓ వైపు తనకు సూటయ్యే కథలతో హీరోగా చేస్తూనే పెద్ద చిత్రాలలో మరలా కామెడీ పాత్రలు చేయడానికి రెడీ అయ్యాడు. సో.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించే చిత్రంలో సునీల్ కమెడియన్‌గా నటించనున్నాడని సమాచారం. ఇక త్రివిక్రమ్ విషయమై సునీల్ తాజాగా మాట్లాడుతూ, త్రివిక్రమ్‌తో చేయాలని నాకు ఎంతగానో కోరిక ఉంది. కానీ ప్రస్తుతం త్రివిక్రమ్ పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ఆయనతో రాబోయే రెండు మూడేళ్లలో ఓ చిత్రం చేయడం మాత్రం గ్యారంటీ. అయినా త్రివిక్రమ్‌తో నా సినిమా ఎంత లేట్ అయితే అంత మంచింది. ఎందుకంటే మరో రెండు మూడేళ్లు ఆగితే త్రివిక్రమ్ ఇమేజ్ మరింతగా పెరుగుతుంది కాబట్టి నాకు అదే మేలు చేస్తుంది.
ఇక 'మన్మథుడు' చిత్రంలో త్రివిక్రమ్ సృష్టించిన బంకు శ్రీను పాత్ర నేపధ్యంలో ఓ చిత్రం చేయాలని భావించాం. కానీ వీలు కాలేదు. నాకు నప్పే క్యారెక్టర్, స్టోరీ ఐడియా త్రివిక్రమ్‌కి తడితే మాత్రం ఆయన నాతో ఖచ్చితంగా సినిమా చేస్తాడని చెప్పుకొచ్చాడు. అయినా త్రివిక్రమ్ అనుకున్నంత ఈజీగా ఎవ్వరికీ ఛాన్స్‌లు ఇవ్వడని ఆర్‌పి పట్నాయక్‌ని చూస్తేనే తెలుస్తుంది. మరి రాజమౌళిని లైన్‌లో పెట్టినట్లు, త్రివిక్రమ్‌ని కూడా లైన్‌లో పెడితేనే సునీల్‌కి హీరోగా మరలా పూర్వవైభవం వస్తుంది.