గతంలో రాంగోపాల్ వర్మ.. పరిటాల రవి, మద్దెల చెరువు సూరి తదితరులపై 'రక్తచరిత్ర' అనే చిత్రాన్ని రెండు భాగాలుగా తీశాడు. కానీ ఆ చిత్రంలో తమ నిజజీవితంలో జరిగిన సంఘటనలు చూపకుండా వర్మ సినిమాటిక్‌గా ఏవేవో చూపించాడని మద్దెలచెరువు సూరి సోదరి గంగుల హేమలతారెడ్డి తాజాగా విమర్శించారు. నిజజీవితంలో జరిగిన సంఘటనలు వేరు అని వాటిని వర్మ చూపించలేదని, అసలు తమ కుటుంబానికి సంబంధించిన ఇళ్లన్నీఒకే చోట ఉన్నట్లు చూపించడం సరికాదని ఆమె వాదిస్తున్నారు. ఇక వర్మ 'వంగవీటి' చిత్రాన్ని కూడా తీశాడు. తాజాగా వంగవీటి మోహనరంగాని కూడా దేవుడిలా చూపించి, ఆయనెంత గొప్పవాడో చెప్పడానికి తాను 150 ఎపిసోడ్స్‌తో ఆయన జీవిత చరిత్రను టీవీసిరియల్‌గా తీస్తున్నానని ప్రముఖ నటుడు, 'హీరో, రంగా ది దొంగ' చిత్రాల దర్శకుడు, ప్రస్తుతం జనసేనలో వున్నానని చెప్పుకుంటున్న జివి సుధాకర్ నాయుడు అంటున్నాడు. వర్మ తీసిన చిత్రంలో ఎడిటింగ్‌లో చాలా ఎగిరిపోయాయని కానీ తాను మాత్రం ఎలాంటి సెన్సార్ ఇబ్బందులు లేకుండా వంగవీటి మహాచరిత్రను వాస్తవాలతో తీస్తానని చెబుతున్నాడు.
ఇక మరోవైపు వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'తో పాటు 'కడప' వెబ్‌సిరీస్‌ని కూడా తీస్తున్నాడు. దీనిపై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డాడు. కడప ప్రజలను, కడప ప్రాంతాన్ని తప్పుగా చూపిస్తే ఊరుకునేది లేదని, 'బెజవాడ' చిత్రంలో వర్మ మార్పులు చేర్పులు చేసిస విధంగానే 'కడప' వెబ్‌సిరీస్‌లో కూడా మార్పులు చేయాలని, లేకపోతే జనమే బుద్దిచెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే మనరెండు తెలుగు రాష్ట్రాలలో మత ఘర్షణలు, ఇస్లామిక్ తీవ్రవాదం అంటే హైదరాబాద్, రౌడీయిజం అంటే విజయవాడ, ఫ్యాక్షనిజం అంటే రాయలసీమ జిల్లాలు, మరీ ముఖ్యంగా కడప గుర్తుకు వస్తాయనేది చారిత్రక వాస్తవం. అంత మాత్రాన వాటిని తీస్తే నిజంగా రౌడీలు, ఫ్యాక్షనిస్ట్‌లు గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారు. వీటిని తీసే వారు ఆయా ప్రాంతాల సామాన్య ప్రజలను కించపరడం లేదు.
కేవలం ఆయా ప్రాంతాలలో ఉన్న రౌడీలు, ఫ్యాక్షనిస్ట్‌లు, నాయకులు, మత ఘర్షణలు లేవనెత్తే వారిపైనే సూటిగా స్పందిస్తున్నారు. మహా అయితే అలాంటి వారి మనోభావాలు దెబ్బతింటాయే గానీ సామాన్య ప్రజల మనోభావాలేమీ దెబ్బతినవు. ఉదాహరణకు పెద్దాపురం, చిలకలూరి పేట, నెల్లూరి నెరజాణలు.. ఇలా ఒక్కో ప్రాంతంపై ఒక్కో ముద్ర అనాది కాలం నుంచి వస్తోంది. అలాగని పెద్దాపురం, నెల్లూరు, చిలకలూరి పేట అని అంటే అందరూ వేశ్యలే అనే భావన ప్రజలకి ఏమీ రాదు. కేవలం నాయకులు మాత్రమే ప్రజల మనోభావాల పేరుతో తమ మనోభావాలను ప్రజలవిగా చెప్పి వారి మీదకు నెడుతున్నారనేది వాస్తవం.