టీవీలలో వచ్చే ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్‌లో అమ్మాయిలకి మొహంపై మొటిమలు వస్తే అందంగా ఉండరని, కాబట్టి తమ క్రీమ్ వాడి మొటిమలు పోగొట్టుకోవాలని సూచిస్తూ ఉంటారు. కానీ సహజసిద్దమైన అందం ముందు ఆర్టిఫిషియల్ అందం దేనికీ పనికిరాదు. ఇక 'ఫిదా' బ్యూటీ సాయిపల్లవికి మొహంపై మొటిమలు ఉంటాయి. అలాంటి మొటిమలతోనే ఆమె మలయాళంలో 'ప్రేమమ్' చిత్రం, తెలుగులో 'ఫిదా'లో నటించి అందరినీ విపరీతంగా ఆకర్షించింది.
ఇక ఈమె తన మొటిమల గురించి చెబుతూ, మొదట నా మొహంపై మొటిమలు వచ్చినప్పుడు నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడే దానిని. కానీ తర్వాత ఆ ఫీలింగ్ పోయింది. నా మొదటి చిత్రం 'ప్రేమమ్'లో మేకప్ లేకుండా మొటిమలతోనే నటించాను. అదే అందరికీ నచ్చింది. నన్ను చూసిన ఇతర అమ్మాయిలు కూడా తాము కూడా నాలాగే మొటిమలు ఉన్నా కూడా అలాగే ఆత్మవిశ్వాసంతో ఉంటామని చెప్పడం నాకు ఆనందాన్ని కలిగించింది. అయినా మొటిమలుంటే ఏంటి? మనం ఎలా ఉన్నామో అలా నేచురల్‌గా ఉండటమే ఆత్మవిశ్వాసం.
ఇక నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే భలే ఇష్టం. నటిని కావాలని కోరుకునే దానిని. కానీ మా నాన్నకు నేను డాక్టర్‌ని కావాలని కోరిక. దాంతో జార్జియాలో మెడిసిన్ చేశాను. నాలుగో సంవత్సరంలో ఉండగా, 'ప్రేమమ్' దర్శకుడు అల్ఫాన్స్ నాకు ఫోన్ చేసి నేను ఓ లవ్‌స్టోరీని తీస్తున్నాను. మీరు నటిస్తారా? అని అడిగారు. ఎవరో ఆట పట్టిస్తున్నారని భావించాను. తర్వాత ఆయనే తన వీకీపీడియా చూడమని చెప్పాడు. దాంతో ఆయనెంత గొప్ప దర్శకుడో అర్ధమైంది. అప్పుడు సారీ చెప్పి సెలవుల్లో నటిస్తానని చెప్పి ఎగిరిగంతేశాను.. అంటూ చెప్పుకొచ్చింది.