ఆమద్య పవన్ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి 'చెప్పను బ్రదర్' అని వ్యాఖ్యలు చేసి పవన్ అభిమానులకు పూర్తిగా వ్యతిరేకిగా అల్లుఅర్జున్ మారిపోయాడు. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే.. అది శుభకార్యమైనా, అశుభకార్యమైనా సరే తమ అభిమాన హీరోని చూస్తే అభిమానులలో ఎక్కడలేని ఆనందం పొంగుకొస్తుంది. దాసరి మృతి సందర్భంగా పరామర్శించడానికి బన్నీ వచ్చినప్పుడు కూడా ఆయన అభిమానులు అంతటి దు:ఖ విషయంలో కూడా బన్నీని చూసి ఆనందంతో పొంగిపోయారు. ఇక తమ అభిమాన నటుడు కనిపిస్తే తమ వీరాభిమానం చూపిస్తూ వారి మాటలను వినాలని, వారితో ఫోటోలు దిగాలని ఫ్యాన్స్ నానా హడావుడి చేస్తారు. ఇది సహజం. వారు నిస్వార్థంగా, తమ అభిమాన హీరో నుంచి ఏమీ ఆశించకుండా ప్రాణాలను సైతం లెక్కచేయని తత్వం ఉన్నవారు.
అభిమానులుంటేనే హీరోలకు గౌరవం, క్రేజ్ వస్తాయి. అలా హీరోలకు ఫ్యాన్స్ అవసరం ఉందే గానీ ఫ్యాన్స్‌కి హీరోలు లేకపోయినా ఫర్వాలేదు. కాబట్టే వాళ్లు ప్రేక్షదేవుళ్లయ్యారు. ఇక అల్లుశిరీష్ హీరోగా వస్తున్న 'ఒక్క క్షణం' ప్రీరిలీజ్ ఈవెంట్‌కి అల్లుఅర్జున్ ముఖ్యఅతిధిగా వచ్చాడు. ఇక ఇటీవల బన్నీ ఫ్యాన్స్ అందరు కలిసి బన్నీ ఆర్మీ పేరుతో ఓ గ్రూప్‌గా ఏర్పడి పవన్ అభిమానుల వ్యతిరేకతను ఎదుర్కొంటూ తమ హీరోపై అభిమానం చాటుకుంటున్నారు. దాంతో బన్నీకి చెందిన బన్నీ ఆర్మీ సభ్యులు కూడా ఈ వేడుకకి వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడే సమయంలో సహజంగానే అభిమానులు కేకలు వేస్తూ, రచ్చ చేస్తూ హంగామా చేశారు. దాంతో బన్నీకి కోపం వచ్చింది. అభిమానులు వచ్చి హడావుడి చేయాలనే ఇలాంటి వేడుకలు చేస్తాం. గోల చేయవచ్చు.. హంగామా చేయవచ్చు గానీ ఎవరైనా మాట్లాడేటప్పుడు వారి మాటలను సైలెంట్‌గా వినాల్సిన బాధ్యత ఉంటుంది. అది బేసిక్ కర్టసీ.
ఒకరి మనోభావాలు చెప్పేటప్పుడు అడ్డు పడటం మర్యాద కాదు అంటూ గట్టిగానే చెప్పాడు. గట్టిగా చెప్పాడు అనే కంటే వార్నింగ్ ఇచ్చాడనే చెప్పాలి. ఇక ఈయన ఏదో టీచర్ ఎల్‌కేజీ స్టూడెంట్స్‌కి క్లాస్ ఇచ్చినట్లు ఇవ్వడం, అలా మాట్లాడిన వాటిల్లో సంస్కారం ఉండాలి.. ఇలా అల్లరి చేస్తే నేను అసహనానికి లోనవుతానని పరుష పదజాలం వాడాడు. నిజానికి బన్నీకి నిజంగా అంత మర్యాద తెలిసిఉంటే ఆయన కెరీర్ ప్రారంభం నుంచి ఇదే విధంగా మాట్లాడుతూ, ఇది నా సిద్దాంతం అని చెప్పి ఉంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన్ను తప్పుపట్టలేం. కానీ హీరోగా ఎదుగుతున్న సమయంలో మాత్రం ఇలాంటివి బాగానే ఎంకరేజ్ చేసిన ఆయన ఇప్పుడు ఒక్కసారిగా స్టార్‌గా మారిన తర్వాత ఇలాంటి నీతులు, సూక్తులు చెబితే ఎలా?
ఇక ఎదుటివారు మాట్లాడేటప్పుడు శ్రద్దగా వినాలని బన్నీ చెప్పాడు. మరి ఆయనను విలేకరులు ఏదైనా కాంట్రవర్శీ క్వశ్చన్స్ వేసేటప్పుడు వారి ప్రశ్నను పూర్తిగా వినకుండానే ఏదేదో మాట్లాడుతాడు. మరి అప్పుడు జర్నలిస్ట్‌లకు అసహనం రాదా? అలా ప్రశ్న మొత్తం వినకుండానే ఎగిరిపడే బన్నీకి ఏ విధమైన సంస్కారం ఉందని మనం భావించాలి...? అనే అనుమానాలు రాకమానవు.