దిల్‌రాజు నేటితరం నిర్మాతల్లో ఓ ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పవచ్చు. ఆయన భార్య అనిత ఆకస్మిక మరణం చెందినా కూడా ఆయనను మరలా సినిమాలపై ఉన్న ద్యాసే ముందుకు నడిపిస్తోంది. ఓ వైపు భార్య మరణం బాధపెడుతున్నా కూడా ఆయన తన చిత్రాల నిర్మాణం ఆపకుండా కొనసాగించాడు. ఇక దిల్‌రాజు అంటే మెగాఫ్యామిలీకి కూడా మంచి అండగా చెప్పుకోవాలి. అందరు హీరోలతో ఆయన చిత్రాలు నిర్మిస్తున్నా కూడా గీతాఆర్ట్స్ కన్నా కూడా మెగాయంగ్ జనరేషన్ హీరోలు ఎక్కువగా దిల్‌రాజుతోనే చిత్రాలు చేస్తున్నారు. సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్‌లే కాదు అల్లుఅర్జున్, రామ్‌చరణ్‌లకి కూడా దిల్‌రాజు ఆప్తుడు. ఇక సాయిధరమ్‌తేజ్‌కైతే మార్గదర్శకుడు. అదే అభిమానంతోనే దిల్‌రాజు నిర్మించిన 'శతమానం భవతి' కి నేషనల్ అవార్డు వచ్చిన వెంటనే మెగా క్యాంపే ఓ వేడుకను ఆయనకు జరిపింది.
ఇక ఈ ఏడాది 'జవాన్' కి దిల్‌రాజు కేవలం ప్రమోషన్ బాధ్యతలు మాత్రమే తీసుకున్నాడు. కానీ మిగిలిన 'శతమానం భవతి, నేనులోకల్, డీజె, ఫిదా, రాజా దిగ్రేట్' లతోపాటు తాజాగా విడుదలైన నాని 'ఎంసీఏ' చిత్రాలు ఆరు దిల్‌రాజు నిర్మాణంలో వచ్చిన చిత్రాలే. అయితే ఈ చిత్రాలలో 'డిజె' తాజాగా విడుదలైన 'ఎంసీఏ' చిత్రాలు మాత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరిచాయి. కలెక్షన్ల సంగతి పక్కనపెడితే మిగిలిన నాలుగు చిత్రాలకు వచ్చినంత స్పందన ఈ రెండు చిత్రాలకు రాలేదు. ప్రతి ప్రేక్షకుడు 'డీజె, ఎంసీఏ' విషయాలలో పెదవి విరిచాడు. కానీ దిల్‌రాజుతో పాటు ఆయన సన్నిహితులు మాత్రం ఈ ఏడాది దిల్‌రాజు వరుసగా ఆరు బంతులను సిక్సర్స్ కొట్టాడని వాదిస్తున్నారు.
ఇక తాజాగా దిల్‌రాజు సక్సెస్ జర్నీకి సంబంధించి వేడుకలు జరిగాయి. దీనికి హాజరైన అల్లుఅర్జున్ మాట్లాడుతూ, ఈ ఆరు చిత్రాలు సూపర్‌హిట్సేనని చెబుతూ ఆయా టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపాడు. శ్రీవెంకటేశ్వర బేనర్‌కి, దిల్‌రాజుకి ఈ సక్సెస్‌లు ఊరికే రాలేదని, ఆయన ఎంతో కష్టపడతాడని చెప్పుకొచ్చాడు. బన్నీ చెప్పింది నిజమే గానీ 'డీజె, ఏంసీఏ' విషయంలో మాత్రం విరుద్ద వాదనలు వినిపిస్తున్నాయి.