ప్రభాస్‌ని గురించి ఆయన పెదనాన్న మాత్రమే కాదు.. ఆయనతో సినిమాలు తీసిన దర్శకులు, మరీ ముఖ్యంగా రాజమౌళి నుంచి అందరు చెప్పేది హి ఈజ్ ది జెంటిల్‌మేన్. ఎంతో వినయశీలి. ఇది ప్రభాస్‌తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. 'బాహుబలి' తర్వాత నేషనల్ స్టార్ అయ్యానన్న ఫీలింగే కాదు.. కనీసం ఆ గర్వం ఛాయలు కూడా ఆయనలో కనిపించవు. ఎంతో మృదుస్వభావి, ఏ మాట మాట్లాడితే ఎవరు హర్ట్ అవుతారో అని ఎంతగానో ఫీలయ్యే సున్నిత మనస్కుడు. ముఖ్యంగా ఆయనను ప్రభాస్‌రాజు అని పిలిస్తే ఆయన పడే ఇబ్బందిని గురించి రాజమౌళిని అడిగితేనే బాగా చెబుతాడు. ఇక ఎవరితోనైనా ఆప్యాయంగా మాట్లాడటం, వారితో కలిసి పోవడం, వారికి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా చూసుకోవడం, ఆదరించడం నుంచి అన్నం పెట్టేంత వరకు ఆయన అంతా ఆయన పెదనాన్న కృష్ణంరాజు మనస్తత్వమే. పేరుకే రెబెల్‌స్టార్ గానీ నిజజీవితంలో వీరిని మించిన సాఫ్ట్ స్టార్స్ ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి లేదు.
తాజాగా కృష్ణంరాజు శ్రీమతి శ్యామలా దేవి మాట్లాడుతూ.. 'ఆదరించే విషయంలో, అభిమానించడం, పెట్టడంలో కూడా ప్రభాస్‌ది అంతా కృష్ణంరాజుగారి పోలికే. ఎప్పుడు అందరూ నవ్వుతూ సరదాగా ఉండాలని ప్రభాస్ కోరుకుంటాడు. ఎప్పుడు సరదాగా, కుటుంబంతో సన్నిహితంగా ఉంటాడు. ఇక కృష్ణంరాజుగారి విషయానికి వస్తే ఫ్యామిలీకి ఆయనే గాడ్. చిన్నాన్న పిల్లల, పెద్ద నాన్న పిల్లలు, మేనకోడళ్లు, మేనల్లుళ్లు, సోదరులు, సోదరీమణులందరికీ ఆయన మాటే వేదవాక్కు. ఆయనను చూసి వారి నాన్నగారు, మా మామయ్య కూడా దశరథ మహారాజుకి రాముడెలాగో మాకు కృష్ణంరాజు అలా అని సంతోషపడేవారు. అలాంటి కొడుకును కన్నందుకు నేనెంతో పుణ్యాత్ముడినని, అదృష్టవంతునని చెప్పేవారు. మా మామగారు మమ్మల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకునే వారు. తన కుమారుడిని నేను బాగా చూసుకుంటాననే నమ్మకం ఆయనకెంతో ఉండేది' అని చెప్పుకొచ్చారు.