ఎవరైనా సరే మహేష్‌బాబుని చూస్తే మిల్కీబోయ్‌లా ఉన్నాడని అనాల్సిందే. ఆయన లుక్స్, ఆయన ఫేస్ నుంచి ప్రతి విషయంలోనూ ఎంతో క్లాస్ లుక్స్ ఆయనలో కనిపిస్తూ ఉంటాయి. అదే సమయంలో హీరోగా మహేష్ క్లాస్ పాత్రలనే కాదు పక్కా మాస్ చిత్రాలను కూడా చేశాడు. ఎంత మాస్ అండ్ యాక్షన్ చిత్రాలలో చేసినా కూడా ప్రేక్షకులు ఈయనను మిల్కీబోయ్‌గానే పరిగణిస్తూ ఉంటారు. ఇక మహేష్ అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్స్‌తో పూర్తి స్థాయిలో మెప్పించిన చిత్రాలు పెద్దగా లేవనే చెప్పాలి. ఆయన పనిచేసే థమ్సప్ నుంచి ఏ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా ఆయన పనిచేసి, ఎంత రిస్కీషాట్స్‌లో కనిపించినా కూడా ఆయనలో అదే స్మైలీ ఫేస్ ఉంటుంది.
కానీ మొదటి సారిగా మహేష్ అవుట్ అండ్ అవుట్ మాస్ అవతారంలో ఉంటే ఎలా ఉంటాడు? అనే దానికి సమాధానం దొరికింది. ఇటీవలే థమ్సప్ కోసం రిస్కీషాట్స్ చేస్తూ యాడ్‌ని చిత్రీకరించుకుని వచ్చిన మహేష్ గత మూడేళ్లుగా పారగాన్ చెప్పులకి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పారగాన్ చెప్పుల కోసం చేసిన యాడ్‌లో మహేష్‌బాబు జీపు మెకానిక్‌గా మారి ఓ జీపుని రిపేర్ చేస్తూ అచ్చు మెకానిక్ మేన్‌గా కనిపిస్తున్నాడు. ఈ 'బిజినెస్‌మేన్'ఇలా హఠాత్తుగా మెకానిక్‌మేన్‌గాఎత్తిన అవతారంకి సంబంధించిన ఫొటో ఒక్కటి ఇప్పుడు మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
చాలామంది కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న 'భరత్ అనే నేను' అనే చిత్రంలోని స్టిల్ ఇది అని కాస్త భ్రమపడ్డారు. ఎన్టీఆర్ చేత 'జనతా గ్యారేజ్' ఓపెన్ చేయించిన కొరటాల.. సీఎంగా నటిస్తున్న మహేష్ చేత జీపు రిపేర్ చేయించడం ఏమిటా? అని ఆశ్యర్యానికి లోనయ్యారు. కానీ ఇది పారగాన్ చెప్పుల ప్రకటన అని తేలిపోవడంతో ఈ చెప్పులకి, ఆ 'జనతా గ్యారేజ్'లోని మెకానిక్ పాత్రకి లింక్ ఏమిటా? అనేది వేచిచూస్తున్నారు...!