పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ ప్రారంభించిన సమయంలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడి ఎంతో గౌరవంగా తెచ్చుకోవాల్సిన తెలంగాణను పార్లమెంట్‌లో కాంగ్రెస్ తీవ్ర దుస్థితికి తెచ్చిందని, ఇలాంటి విభజన చూసి తాను ఎంతో ఆవేదన చెందానని పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక ఓ సారి కేసీఆర్‌ని పవన్ కళ్యాణ్ గురించి అడగ్గా, పవన్ కళ్యాణా? ఎవరాయన? జనసేన అనే పార్టీ ఉన్నట్లే నాకు తెలియదే అని కేసీఆర్ వ్యంగ్యంగా స్పందించాడు. ఇక కిందటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కేసీఆర్ కూతురు కవిత నడుపుతున్న తెలంగాణ జాగృతి సంస్థ లెక్కలను చెప్పాలని డిమాండ్ చేయడం, దానికి కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగాయి.
ఇక ఇటీవల తాజాగా కూడా కేసీఆర్ ఏపీలో తాను వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు, సీట్లు వస్తాయో సర్వే చేయించానని, జనసేనకి ఒక్కశాతం ఓట్లు కూడా రావని తేలిందని మాట్లాడాడు. దానికి పవన్ కూడా ఇన్‌డైరెక్ట్‌గా కేసీఆర్‌పై సెటైర్ వేశాడు. అలాంటిది కేసీఆర్, పవన్ కళ్యాణ్ లు కలుసుకుని ఏకాంతంగా మాట్లాడుకోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే పరిణామమే. తాజాగా శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ కి గవర్నర్ రాజభవన్‌లో భారీ విందును ఏర్పాటు చేశారు. దీనికి తెలంగాణ సీఎం, ఏపీ సీఎంలు అయిన ఇద్దరు చంద్రులతోపాటు రెండు రాష్ట్రాల మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ విందుకు పవన్‌కళ్యాణ్‌ని, చిరంజీ విని కూడా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేసీఆర్, పవన్‌లు కాసేపు వ్యక్తిగతంగా సంభాషించుకున్నారు. ఏమి మాట్లాడుకున్నారో తెలియకపోయినా ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చే జరిగి ఉంటుంది. మొత్తానికి కేసీఆర్‌కి పవన్ ఓ పార్టీ నాయకుడని, సినిమా ఛరిష్మానే కాకుండా రాజకీయ ప్రవేశం చేసిన నాయకుడని ఇప్పుడైనా తెలిసిందంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరి వారు ఏమి మాట్లాడుకున్నారో... ఇద్దరిలో ఎవరో ఒకరు బయటికి చెప్పే వరకు తెలిసే అవకాశం లేదు...!