భూమిక అంటే ఆమె నటించిన 'ఖుషీ' చిత్రంలోని పాత్ర అందరికి ఇట్టే జ్ఞాపకం వస్తుంది. కానీ ఈమె కెరీర్ మంచి పొజిషన్‌లో ఉండగానే యోగా గురు భరత్‌ఠాకూర్‌ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత తానే నిర్మాణ సంస్థను స్థాపించి 'తకిట తకిట' చిత్రాన్ని నిర్మించింది. ఇక ఓ తెలుగు సినీ మేగజైన్‌ని కూడా ప్రారంభించింది. కానీ అవేమీ సక్సెస్ కాలేదు. ఇక ఆ మధ్య అల్లరినరేష్ హీరోగా అల్లరి రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'లడ్డూబాబు'లో ఓ పిల్లాడికి తల్లిగా నటించింది. ఈ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు.
తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రకాష్‌రాజ్ సరసనే కాకుండా తాజాగా విడుదలైన దిల్‌రాజు-నానిల 'ఎంసీఏ' చిత్రంలో రాజీవ్‌కనకాల భార్యగా, నానికి వదినగా కీలకపాత్రను చేసింది. కానీ నాడు హీరోయిన్‌గా ఆమెని చూసిన వారు ఆమెను రాజీవ్‌కనకాల సరసన, నానికి వదినగా జీర్ణించుకోలేకపోతున్నారనేది మాత్రం వాస్తవం. ఇక ఆమె ప్రస్తుతం తాను చేస్తోన్న సపోర్టింగ్ రోల్స్ గురించి మాట్లాడుతూ, నా వయసుకు తగ్గ పాత్రలను చేయడంలో నాకేమీ అభ్యంతరం లేదు. అయినా వయసును దాచుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు విద్యాబాలన్ నటించిన 'తుమ్హారీ సులూ' వంటి చిత్రాలలో నటించాలని ఉంది. తెలుగు పరిశ్రమ అంటే నాకెంతో ఇష్టం. ఇక్కడ నన్ను ఎంతో గౌరవంగా చూసుకుంటారు. అయినా నా వద్దకు వచ్చిన ప్రతి పాత్రను నేను చేయడం లేదు. బాగున్న చిత్రాలే ఓకే చేస్తున్నాను.... అని చెప్పుకొచ్చింది.
ఇక ప్రస్తుతం నాగచైతన్య-చందు మొండేటిల దర్శకత్వంలో మలయాళ రీమేక్‌గా వచ్చిన 'ప్రేమమ్' తర్వాత చైతూ, చందుల కాంబినేషన్‌లో ప్రస్తుతం 'సవ్యసాచి' అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో తమిళ సీనియర్ విలక్షణ నటుడు మాధవన్ విలన్ పాత్రను చేస్తుండగా, భూమిక ఈ చిత్రంలో ఓ కీలకపాత్రకు ఎంపికైందని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా సాధారణంగా ఏచిత్రాలంటే వాటిని కాకుండా మంచి చిత్రాలనే ఎంచుకుంటున్న కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.