నాని 'భలే భలే మగాడివోయ్' తర్వాత నేచురల్‌స్టార్ అయిపోయాడు. 'మజ్ను, కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రాలు ఫర్వాలేదనిపించినా కూడా నాని స్టామినానే ఆ చిత్రాలను విజయ పధంలో నడిపించాయి. ఇక తాజాగా దిల్‌రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మొదటి రోజే హిట్ అని చెప్పడం కరెక్ట్ కాదు.. ఒక వారం ఆగితే గానీ ఏ సినిమా స్థాయి ఏంది? అనేది తేలదని, తాను టాలీవుడ్‌లో అదే రూట్‌ని ఫాలో అవుతానని, ఆ మార్పు మనలో ఉండాలని చెప్పుకొచ్చాడు. చివరకు తన సినిమా వరకు వచ్చేసరికి 'ఎంసీఏ' విడుదలైన సాయంత్రమే సక్సెస్‌మీట్ పెట్టి ఆరో సిక్స్ కొట్టేశామని డప్పు వాయించాడు. ఆయన సిక్స్ కొట్టామని చెప్పుకుంటున్న ఆరో బంతి బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్ చేతిలోకి చిక్కిందని ఆయన తెలుసుకోలేక గ్యాలరీలోనే ప్రేక్షకులు ఈ సిక్స్‌ని పట్టారని భావిస్తున్నాడు.
ఇక నాని కంటూ ఓ స్థాయి, ఓ ఇమేజ్ ఉన్నాయి. ఆయన కులం పేరుతో పాటు ఫేక్ విషయాలు మాట్లాడడని, నిజాయితీ పరుడని అందరూ భావించేవారు. కానీ నాని కూడా 'ఎంసీఏ' చిత్రం సిక్సేనంటున్నాడు. ఓవైపు టీవీలో రీప్లేలో అవుటని తేలుతున్నా దానిని చూసే మూడ్‌లో వారు లేరు. 'ఎంసీఏ' చిత్రం కథ నాసిరకంగా, కాస్త పాతచింతకాయపచ్చడిలా ఉన్నా, దిల్‌రాజు, నాని, 'ఫిదా' సాయిపల్లవి, దేవిశ్రీప్రసాద్ వంటి వారు మ్యాజిక్ చేస్తారని అందరూ భావించారు. 'నేను లోకల్' తరహాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ని చూపించైనా బండి లాగిస్తారని ఊహించారు. కానీ వేణు శ్రీరామ్ మరోసారి 'రేసుగుర్రం' చిత్రాన్నే అటు ఇటు తిప్పి చూపించాడు. ఇక భూమికను వదినగా, రాజీవ్ కనకాలను అన్నయ్యగా ఊహించుకోవడం ఎవ్వరి వల్లా కాలేదు. దాంతో ఈ చిత్రం నాసిరకంగా తయారైంది.
ఇక 'హలో' చిత్రంలో ఎన్ని లోపాలున్నా.. మంచి ఫీల్ ఉన్న మూవీ అనే టాక్ వచ్చింది. దీంతో యూఎస్‌లో 'ఎంసీఏ'ని భారీ రేటుకి కొన్నవారు హడలిపోతున్నారు. యూఎస్‌లో కూడా క్రిస్మస్ హాలీడేసే అయినా చలి ఎక్కువ కావడంతో మన వారు రెండు చిత్రాలను చూసే పరిస్థితి లేదు. దాంతో అందరు 'హలో' వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్లే ఏకంగా 'అఖిల్' చిత్రానికి ఫుల్‌రన్‌లో వచ్చిన వాటిని సాధించాయి. ఇక దిల్‌రాజు, నానిలు కాస్త క్రిస్మస్ అయిపోతే గానీ నిజాలను నమ్మకపోవచ్చు. అయినా 'డిజె' విషయంలో వాదించినట్లుగానే మొండిగా హిట్టు అని వాదిస్తే అది వారి విజ్ఞత మీదే ఆధారపడి ఉంది..!