ఒకవైపు ప్రభుత్వాలు, మానవ సంఘాలు, మీడియా వంటివి మూఢనమ్మకాలు వద్దనే చెబుతుంటాయి. కానీ అదే పనిని టీవీలలో పెయిడ్ ప్రోగ్రామ్స్‌గా ప్రచారంచేస్తూ, బట్టతల పోయి జుట్టు వచ్చింది.. ఇంత సన్నబడ్డాను... ఈ దేవుని తాయత్తు తీసుకున్న తర్వాత నా జీవితంలో ఎన్నో ఆశ్యర్యకరమైన సంగతులు జరిగాయి. కోటీశ్వరుడిని అయిపోయాను. ఈ క్రీమ్‌ని మొహానికి రాసుకుంటే తెల్లగా మారుతారు. ఫలానా మాత్ర మింగితే బరువు తగ్గి నాజూకుగా తయారవుతారని టీవీ నిండా అవే కార్యక్రమాలు, మూఢనమ్మకాలను ప్రేరేపించే షోలనే ప్రచారం చేస్తుంటారు. సెక్స్ విషయంలో కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రకటనలు రూపొందిస్తూ ఉంటారు. ఇదేంటి అని అడిగితే ఇవి పెయిడ్ షోలంటారు.
అక్షరాస్యత తక్కువగా ఉండే మన దేశంలో ఏది పెయిడ్ షో.. ఏది నిజమైన షో అనేది పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఇక థమ్సప్ నుంచి పలు శీతలపానీయాలు, చీటోస్, కుర్‌కుర్రే వంటి ప్రకటనలు టీవీలలో చూపిస్తుంటే పిల్లలను వాటికి దూరంగా ఉంచడం అసాధ్యమనే చెప్పాలి. ఇక మన స్టార్స్ నేడు శీతల పానీయాల నుంచి మద్యం బ్రాండ్స్ వరకు అన్నింటికి బ్రాండ్ అంబాసిడర్స్‌గా పనిచేస్తున్నారు. నాడు బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉన్న చిరంజీవి థమ్సప్ ప్రకటనలో నటించడం, తర్వాత పవన్ 'పెప్సీ'లో నటించడంపై తీవ్ర దుమారం చెలరేగింది. కానీ ఇప్పటికీ మహేష్‌బాబు అలాంటి వాటిల్లో నటిస్తూనే ఉన్నాడు. జనాలకు శీతలపానీయాల కన్నా పండ్లు, జ్యూస్‌లు మంచివన్ని, కొబ్బరి బొండాలు తాగడం మంచిదని చెప్పాల్సిందిపోయి తమకున్న క్రేజ్‌ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఇక ఫెయిర్‌నెస్ యాడ్స్‌లో అయితే నల్లగా, చామనచాయగా కనిపించడమే అందవికారం అని, తమ ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడి తెల్లబడాలని చెబుతుంటారు.
తాజాగా ఇలాంటి ఓ మనుషుల బరువును తగ్గించే మాత్రలు వేసుకుంటే సన్నగా, నాజూకుగా మారిపోతారని, ఈ మాత్ర మింగితే ఎలాంటి వ్యాయామాలు, కష్టాలు పడకుండా సన్నబడతారనే ఓ యాడ్‌లో నటించమని హీరోయిన్ పూజా హెగ్డేకి ఆఫర్ వచ్చిందట. వారు ఎంతో భారీ పారితోషికం ఇస్తామని చెప్పినా ఆమె చేయనని చెప్పి... బరువు తగ్గేందుకు మందులు వాడితే.. వాటి సైడ్‌ఎఫెక్ట్స్ ఎన్నో ఉంటాయి. మేము చెబితే జనాలు నమ్మి కొంటారు. కేవలం కఠినమైన వ్యాయామం, యోగా, ఖచ్చితమైన డైట్‌ని ఫాలో కావడమే సన్నగా మారడానికి ఉపయోగపడుతుందని చెప్పిన పూజాహెగ్డే ఈ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా ఉండటానికి నో చెప్పడం సంతోషదాయకం..!