సినిమా కొత్త కథలకు మూలం పాత చిత్రాల నుంచి స్ఫూర్తి పొందడమో లేక నిజజీవిత ఘటనలు, లేదా రామాయణం, మహాభారతం వంటి వాటిల్లో నుంచి ఓ పాయింట్‌ని తీసుకుని దానికి హైటెక్ హంగులు సమకూర్చడమే. అంటే కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా ఉంది పరిస్థితి. మరి కొన్ని చిత్రాలను చూస్తుంటే ఏదో ఒక పాత్ర చిత్రం మనకు జ్ఞప్తికి వస్తూ ఉంటుంది. అందుకే మన మేకర్స్ కూడా తెలివిగా ఏమి చెబుతారంటే.. కథ పాతదే అయినా కొత్తదనం నిండిన ట్రీట్ మెంట్, మంచి స్క్రీన్‌ప్లే ఉంటాయని చెబుతారు. మరికొందరు బాబూ.. ఈ చిత్రం ఏ విదేశీ చిత్రమో కాదు... పక్కా తెలుగు చిత్రానికే జిరాక్స్ అని చెప్పినా కొందరు ఒప్పుకోరు. కాపీ వేరు, స్ఫూర్తి వేరని లెక్చర్లు ఇస్తారు.
ఇక నాటి 'మీనా' చిత్రాన్ని త్రివిక్రమ్ 'అ..ఆ' అంటూ తీశాడు. 'మూగమనసులు' , 'ప్రేమనగర్' వంటి చిత్రాల కాపీలే 'జానకి రాముడు'. 'మజ్ను' వంటి చిత్రాలు. 'పసివాడి ప్రాణమే' 'భజరంగీ భాయిజాన్'. ఇక రాబోయే 'అజ్ఞాతవాసి' కూడా యండమూరి నవల, వెంకటేష్, జయసుధలు నటించిన 'ఒంటిరిపోరాటం' అనే వినిపిస్తోంది.
ఇక తాజాగా 'హలో' చిత్రం చూసిన వారికి కూడా పుష్కరకాలం ముందు ఎమ్మెస్‌రాజు నిర్మాతగా ఉదయ్‌కిరణ్, రీమాసేన్ ల కాంబినేషన్‌లో వి.యన్. ఆదిత్య తీసిన 'మనసంతా నువ్వే'కి కాపీనే అనే తేలుతోంది. కాకపోతే 'హలో' ఈ కాలానికి తగ్గట్లుగా రూపొందిన హైటెక్ వెర్షన్. 'మనసంతా నువ్వే'లో కూడా హీరోహీరోయిన్లు చిన్నప్పుడే విడిపోతారు. వారికి ఆధారంగా ఓ వాచ్ ఉంటుంది. సినిమా మధ్యలో వారు కలుస్తున్నా.. చిన్ననాడు విడిపోయింది తామేనని వారికి తెలియదు. చివరకు ఆ వాచీ క్లైమాక్స్‌లో దొరుకుతుంది. కాకపోతే అందులో హీరోకి ఆ వాచీ ఈజీగా దొరికేస్తుంది. కానీ 'హలో'లో మాత్రం వీరోచితంగా పార్కోర్ ఫైట్స్ చేస్తాడు హీరో.. మిగిలినదంతా సేమ్ టు సేమ్ 'మనసంతా నువ్వే'నే. ఇక 'యమదొంగ'లో హీరోహీరోయిన్ల మధ్య జరిగే స్టోరీ కూడా ఇలాంటి ఓ అద్భుత అంగుళీకం ఆధారంగానే రూపొందింది.