నాడు ఎన్టీఆర్, ఏయన్నార్‌లు కలిసి ఆమెకి పొగరు.. సినిమా షూటింగ్‌లకు సరిగారాదు. కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది. మనకి మర్యాద ఇవ్వదు అని వారిలో వారు నిర్ణయించుకుని తనను సినిమాలలోకి తీసుకోకుండా చేశారని నాటి ప్రముఖ కథానాయిక జమున చెప్పుకొచ్చింది. అయినా నేను తగ్గలేదు. నాకు వచ్చే ఛాన్స్‌లు నాకు వస్తాయని చెప్పాను. డిస్ట్రిబ్యూటర్లు కూడా వారి సినిమాలను ఎలా కొన్నారో నా చిత్రాలను అలాగే కొన్నారు. చివరకు 'గుండమ్మకథ' సమయంలో మా మధ్యరాజీ కుదిరింది. ఇక నేను సారధి స్టూడియోస్‌లో మొదటి హీరోయిన్‌ని. ఈ స్టూడియో హైదరాబాద్‌లోనే ఉండేది. అందులో వరుసగా చిత్రాలు చేశాను. కానీ కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రం తామే ఇండస్ట్రీని మద్రాస్ నుంచి హైదరాబాద్ తెచ్చామని చెప్పుకోవడం సమంజసం కాదు.
ఇక నాటి టాప్ హీరోయిన్, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ఒక సినిమాలో కలసి నటించేటప్పుడు గొడవ వచ్చింది. ఆమె నాతో రిహాల్సర్స్ చేయనని చెప్పింది. ఆమెది అదో రకం మెంటాలిటీ. దాంతో నేను కూడా మేకప్ తీసేసి రిహాల్సర్స్ చేయనని చెప్పి వెళ్లబోయాను. తర్వాత నిర్మాత దర్శకులు నచ్చజెప్పడంతో ఓకే అన్నాను. ఇక నేను సావిత్రి కలిసి ఎన్నో చిత్రాలలో నటించాం. ఎక్కువగా అక్కాచెల్లెళ్ల పాత్రల్లో చేశాం. దాంతో నిజజీవితంలో కూడా అక్కా, చెల్లి అనే పిలుచుకునే వారం. 'మిస్సమ్మ' చిత్రం షూటింగ్ సమయంలో లంచ్‌కి మా ఇంటి నుంచి పప్పు, కూరలతో భోజనం వచ్చింది. పక్కనే అక్క మాంసం తింటూ కనిపించింది.
అప్పటికీ నేనెప్పుడు మాంసం చూడలేదు. దాంతో ఏందక్కా అది అని సావిత్రిని అడిగాను. మాంసం.. ఏం తింటావా? అని అడిగింది. ఛీ.. నేను తినను అన్నాను. దాంతో పక్కనే ఉన్న సావిత్రి అక్క నా తలపై కొట్టి నువ్వు మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటావు? నీకు ఇష్టం లేకపోతే దూరంగా కూర్చుని భోజనం చేయ్. అంతేగానీ.. తినే వారి ముందు ఛీ అంటే ఎవరైనా బాధపడతారు అని చెప్పింది.. అంటూ నాడు పల్లెటూరి గడుసు అమ్మాయిలా, ఉత్తమ గృహిణిగా, అందమైన ఇల్లాలిగా కనిపించి మెప్పించిన జమున ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది...!