నేటిరోజుల్లో గ్లామర్ షో లేకుండా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడమనేది ఓ కలలా మారుతోంది. కొత్తగా వచ్చిన భామలు మూడు నాలుగు చిత్రాలకే తెరమరుగవుతున్నారు. ఏమాత్రం ఛాన్స్ వచ్చినా వీరి స్థానాలను కబ్జా చేసేందుకు అన్ని విప్పి చూపించే నార్త్ భామలు క్యూకడుతున్నారు. కానీ మన సౌత్ ఇండస్ట్రీకి చెందిన భామలు మరీ ముఖ్యంగా మలయాళ కుట్టీలు మాత్రం ఇంతటి పోటీలో కూడా తమ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు. ఇక మలయాళ కుట్టీలనే కాదు... 'ఫిదా' బ్యూటీ సాయిపల్లవి, కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్, అనుపమ పరమేశ్వరన్, నివేదాథామస్, మెహ్రీన్, కళ్యాణి ప్రియదర్శన్, మేఘాఆకాష్ వంటివారు ఈ వరుసలో ముందున్నారు.
ఇక తెలుగులో తన మొదటి చిత్రం 'ఫిదా' తోనే భాన్సువాడ భానుమతిగా అందరి కళ్లలో పడిన నటి సాయిపల్లవి. ఈ అందాల మొటిమల భామ తనదైన అవకాశాలతో దూసుకెళ్తోంది. తాజాగా ఆమె నాని హీరోగా దిల్‌రాజు నిర్మాతగా చేసిన 'ఎంసీఏ' చిత్రానికి మిక్స్‌డ్‌టాక్ నడుస్తోంది. ఇందులో సాయిపల్లవి మరోసారి తన మ్యాజిక్ చేయలేకపోయిందని కొందరు అంటున్నారు. ఇక ఆమె 'కణం' చిత్రంలో లైకా ప్రొడక్షన్స్ బేనర్‌లో నాగశౌర్య సరసన నటిస్తోంది. ఇటు మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో కూడా ఈమెకి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో రాబోయే రోజుల్లో కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయెల్ వంటి వారికి సాయిపల్లవి పెద్ద పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం 'అజ్ఞాతవాసి, మహానటి'లతో పాటు సూర్య సరసన 'గ్యాంగ్' చిత్రాలలో కీర్తిసురేష్ నటిస్తోంది. మరోవైపు అను ఇమ్మాన్యుయేల్ పవన్, బన్నీ, రామ్‌చరణ్, సాయిధరమ్‌తేజ్, నాగచైతన్యవంటి వారితో జత కడుతోంది. ఇక సాయిపల్లవి విషయానికి వస్తే ఆమె యంగ్‌హీరోల సరసన నటిస్తే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. దానికి తగ్గేట్లే వరుణ్‌తేజ్, నాని, నాగశౌర్యలతో జతకడుతోంది. కానీ ఇప్పుడు ఆమెకి సీనియర్ స్టార్‌గా చెప్పుకునే సూర్య చిత్రంలో అవకాశం లభించింది.
దీనిపై ఆమె మాట్లాడుతూ, తమిళంలో 'కాకాకాక', (తెలుగులో వెంకటేష్ 'ఘర్షణ')చిత్రం చూసినప్పటి నుంచి నేనే సూర్యకి వీర ఫ్యాన్‌ని. సూర్య నా ఫేవరేట్ హీరో. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. ఆయనతో ఓ చిత్రం చేసినా చాలు అని కలలు కనే దానిని. కానీ అది త్వరగా నెరవేరదని భావించాను. కానీ సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించే చిత్రంలో నాకు అవకాశం వచ్చింది. నా కల నెరవేరినందుకు ఎంతో ఆనందంగా ఉంది.. అని చెప్పుకొచ్చింది. ఇక సెల్వరాఘవన్ చిత్రాలలో హీరోయిన్లకి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. 7/జి బృందావన కాలని, వర్ణ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులేలో త్రిష, కలర్స్ స్వాతి వంటి వారు దానికి ఉదాహరణ. ఇక సాయిపల్లవి సూర్యతో ఛాన్స్ వచ్చింది కాబట్టే అలా చెబుతోందా? లేక నిజంగానే ఆమె సూర్యకి ఫ్యానా? అనేది ఆమెకే తెలియాలి...!