మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎంతటి మేధావో వేరే చెప్పక్కర్లేదు. ఎంతో అనుభవ శాలిలా ఉంటుంది త్రివిక్రమ్ ప్రసంగం. తన సినిమాలలో కామెడీతో కూడిన డైలాగ్స్ తో హిట్ కొట్టేస్తాడు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో కూడా కామెడీ పండించగల సత్తా త్రివిక్రంలో ఉంది. అలాంటి త్రివిక్రమ్ కి సినిమా ఇండస్ట్రీలో ఒక గురువు ఉన్నాడు. ఆయన్ని ఎప్పుడూ తన గురువుగా భావించడమే కాదు... కావాల్సిన గౌరవాన్ని ఆయనకిస్తాడు త్రివిక్రమ్. ఆయనెవరో కాదు పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. సిరివెన్నెల ఎంతటి మేధావో అందరికి తెలిసిందే. అలాంటి మేధావిని... త్రివిక్రమ్ తన గురువుగా భావిస్తాడు. అయితే ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ సినిమాల్లో సిరివెన్నెల పాటలకు చోటు లేకపోవడంతో త్రివిక్రమ్, సిరివెన్నెలని లైట్ తీసుకున్నాడని ప్రచారం జరిగింది.
కానీ త్రివిక్రమ్ మాత్రం ఆయనకున్న మేధా సంపత్తికి నా సినిమాల స్థాయి సరిపోదు. అందుకే ఆయనతో నేను పాటలు రాయించుకోవడం లేదు. కానీ ఇప్పుడు అజ్ఞాతవాసి కోసం అయనతో పాట రాయించుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఇక అజ్ఞాతవాసి పాటలన్నిటికన్నా సిరివెన్నెల రాసిన గాలి.. వాలుగా పాటే అందరి హృదయాలను దోచుకుంది. అలాంటి వ్యక్తిని అజ్ఞాతవాసి ప్రమోషన్స్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ గా తానే ఇంటర్వ్యూ చెయ్యబోతున్నాడంటున్నారు.
అజ్ఞాతవాసి సినిమా జనవరి 10 న విడుదలవుతున్న సందర్భంగా త్రివిక్రమ్ కాస్త వెరైటీగా ఆలోచించి సిరివెన్నెలని తన స్టయిల్లో ఇంటర్వ్యూ చేస్తాడట. మరి హీరో హీరోయిన్స్, డైరెక్టర్, నిర్మాతల ఇంటర్వ్యూలు ఎలానూ ఉంటాయి. ఇలా ఒక దర్శకుడు పాటల రచయితను ఇంటర్వ్యూ చెయ్యడం కాస్త కొత్తగానే అనిపిస్తుంది. అలాగే ఇద్దరు మేధావుల మధ్య జరిగే ఆ ఇంటర్వ్యూ కోసం చాలామందే ఎదురు చూస్తున్నారు కూడా.