తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జయ మరణం, కేంద్రంలోని బిజెపి జోక్యం, పళని స్వామి, పన్నీర్ సెల్వం, శశికళ వర్గం, దినకరన్‌లతో పాటు కమల్ రాజకీయ ప్రవేశంపై క్లారిటీ వచ్చింది. కానీ జయలలిత మరణం తర్వాత ఆమెపై వచ్చిన అవినీతి, అక్రమ సంపాదన నిజమని తేలడం, మరోవైపు జయ బతికి ఉంటే ఆమె కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చేది అనేది వాస్తవం. ఆమె మరణించడంతో కేవలం శశికళనే జైలు ఊచలు లెక్కిస్తోంది. మరోవైపు కిందటి తమిళనాడు ఎన్నికల్లో యూపీఏ గవర్నమెంట్‌లో 2జి స్కాంలో డిఎంకే నాయకులు కనిమొళి, రాజాలపై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా కీలకపాత్ర పోషించాయి. తాజాగా 2జిలో ఏ స్కాం జరగలేదని తేలింది. ఇది డీఎంకేకు మరీముఖ్యంగా కాబోయే డీఎంకే వారసుడైన స్టాలిన్‌కి పెద్ద ఊరట. డీఎంకే నేతలపై అవినీతి ఆరోపణలు నిజం కాదని తేలగా, జయ అవినీతి నిజమేనని తేలింది.
ఇక తమిళనాడు రాజకీయాల విషయంలో రజనీకాంత్ స్టాండ్ ఏమిటనేది? ఇంకా అర్ధం కావడం లేదు. నాడు తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో రజనీ ఫ్యాన్స్‌ని కలిశాడు. తర్వాత ఆర్కేనగర్ ఉప ఎన్నికల సందర్భంగా మరోసారి ఫ్యాన్స్ మీట్ అన్నాడు. ఆ ఉప ఎన్నికలు వాయిదాపడి తాజాగా జరిగాయి. వీటి ఫలితాలు 24వ తేదీన తేలనున్నాయి. ఇంతలో రజనీ మరోసారి తన ఫ్యాన్స్‌తో మీట్ అవుతున్నాడు. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు ఇవి జరగనున్నాయి. అంటే ఆర్కేనగర్ ఫలితం తేలిన తర్వాతే రజనీ ఫ్యాన్స్‌ని కలవనున్నాడు.
ఇక ఈ ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొనే అందరు తప్పనిసరిగా ఫ్యాన్స్ క్లబ్ నుంచి ఐడెంటిటీ కార్డు తీసుకోవాలి. మద్యం తాగి ఈ సమావేశాలకు రావడం, రజనీకి సాష్టాంగ ప్రమాణాలు, కౌగిలించుకోవడం వంటివి నిషిద్దం. మరి ఆర్కేనగర్ ఫలితాల తర్వాత అయినా రజనీ తన పొలిటికల్ ఎంట్రీపై స్పష్టతనిస్తాడా? లేక ఇవి కేవలం నా అభిమానుల మీటింగ్‌లేనని చెబుతాడా? అనేది వేచిచూడాల్సివుంది!