'బాహుబలి-ది బిగినింగ్, బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రాల తర్వాత రాజమౌళి ఇప్పుడు కాదు బాబోయ్ అని తలలు పట్టుకున్నా కూడా ఆయన తదుపరి చిత్రం 'మహాభారతం' అనే వార్తలు ఆగలేదు. మరికొందరైతే కావాలని రాజమౌళిని దెబ్బతీసేందుకే మోహన్‌లాల్ 1000కోట్ల బడ్జెట్‌తో 'రాండామూజం' ఆధారంగా మహాభారతం తీస్తున్నాడని వార్తలు గుప్పించారు. ఇక ఇటీవల అమీర్‌ఖాన్ కూడా తాను 'మహాభారతం' చేయాలని ఉందని, తనకు అందులో ఇష్టమైన పాత్రలు కర్ణుడు, అర్జునుడు అని కానీ వాటిని కాదని శ్రీకృష్ణునిగా నటించాలనే ఒత్తిడి పెరుగుతోందని చెప్పుకొచ్చాడు. ఇక రాజమౌళి 'మహాభారతం' తీస్తే అందులో జూనియర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రను పోషిస్తాడనే ప్రచారం కూడా జరిగింది. రాజమౌళి వెంటనే 'మహాభారతం' తీస్తానని చెప్పలేదు. అది తీసేందుకు ప్రస్తుతం తగినంత అనుభవం తనకు లేదని, అది తన లైఫ్ టైం గోల్ మాత్రమేనని, 'మహాభారతం' అనేది ఓ మహాసముద్రం వంటిదని, కాబట్టి ఎందరు ఎన్ని తీసినా ఆ మహాసముద్రంలోని చెంబుడు నీళ్లను కూడా చూపించలేరని నిజాయితీగా ఒప్పుకున్నాడు.
ఇక ఈ చిత్రం తీయాలంటే కనీసం ఐదారు పార్ట్‌లుగా తీయాల్సి వస్తుందని, తనకు యుద్దాలంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు 'మహాభారతం' తీస్తానని చెప్పాడు. ఇక రాజమౌళి తన ప్రతి చిత్రం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. తనపై విపరీతమైన అంచనాలు ఉండే సమయంలో సందర్భోచితంగా కథను ఎంపిక చేసుకుంటూ ఉంటాడు. 'మగధీర' తర్వాత 'మర్యాదరామన్న, ఈగ' ఈ కోవకే వస్తాయి. ఇక 'బాహుబలి' రెండు పార్ట్‌ల తర్వాత గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లు లేని పక్కా మాస్, అండ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఎన్టీఆర్, చరణ్‌లతో ఓ మల్టీస్టారర్ చేయనున్నాడు. ఆయన ఈ చిత్రం తదుపరి మరోసారి ప్రభాస్‌తో చేస్తాడనే వార్తలు వస్తున్నాయి.
రాజమౌళి పనిచేయాల్సిన స్టార్స్ లిస్ట్ చాలానే ఉన్న నేపధ్యంలో ఆయన ఇప్పటికే 'చత్రపతి, బాహుబలి-ది బిగింగ్, బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రాలను ప్రభాస్‌తోనే చేశాడు. ఇక ఐదేళ్లు 'బాహుబలి' కే కేటాయించడంతో అటు రాజమౌళి గానీ ఇటు ప్రభాస్ కానీ ఇంత తక్కువ వ్యవధిలో మరోసారి జత కట్టడం సాధ్యమయ్యే పనే కాదు. మరో వైపు రాజమౌళి కోసం ఎందరో స్టార్స్ ఎదురు చూస్తుంటే... ప్రభాస్ కోసం టాలీవుడ్ డైరెక్టర్లు, బాలీవుడ్ మేకర్స్ కూడా క్యూలో ఉన్నారు. సో.. ఇదే విషయాన్ని జక్కన్న చెబుతూ, వెంటనే మరో చిత్రం చేయమని, భవిష్యత్తులో మాత్రం ప్రభాస్‌తో మరోసారి చేస్తానని చెప్పి ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చాడు.