నేటిరోజుల్లో ఎంత పెద్దహిట్ చిత్రాలైనా రెండు మూడు వారాలకు మించి థియేటర్లలో ఆడటం లేదు. కానీ బాలయ్య నటించిన 'లెజెండ్' చిత్రం మూడేళ్లు అడింది అని వారికి వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. టీవీ ఛానెల్స్‌లో కూడా ఎన్నోసార్లు వచ్చిన ఈ చిత్రం మూడేళ్లపాటు ఆడిందనే ప్రచారం చూస్తే ఎవరికైనా నవ్వురాకమానదు. ఇక రాజశేఖర్ కూడా ప్రస్తుతం ఇదే కోవలో నడుస్తున్నాడని చెప్పవచ్చు. ఎంతైనా రాజశేఖర్ బాలయ్య అభిమాని కావడం, రాజశేఖర్ నటించిన 'పీఎస్వీగరుడవేగ' ఆయన ద్వారానే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. దాంతో రాజశేఖర్ కూడా బాలయ్య రూట్‌నే ఫాలో అవుతున్నాడా? అనిపిస్తోంది.
ఇక రాజశేఖర్‌కి ప్రవీణ్‌సత్తార్ దర్శకత్వంలో వచ్చిన 'పీఎస్వీగరుడవేగ'ని కమ్‌బ్యాక్ మూవీగా చెప్పుకున్నారు. సినీ ప్రముఖులతో పాటు యూనిట్ కూడా ఎంతగా ప్రమోషన్స్ నిర్వహించినా ఈ చిత్రానికైతే పాజిటివ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్లు, పెట్టుబడి రీత్యా చూస్తే ఈ చిత్రం భారీ నష్టాలనే మిగిల్చింది. రాజశేఖర్ మార్కెట్‌కి మించి భారీ బడ్జెట్‌ని పెట్టడమే దీనికి కారణం. ఇక ఈ చిత్ర నిర్మాత శ్రీనివాసరాజు ఎక్కడ ఉన్నాడో.. ఏమి చేస్తున్నాడో గానీ అర్ధం కావడం లేదు. ఈ చిత్రం హిట్ ఫ్లాప్‌లని పక్కనపెట్టి ఈ చిత్రం విడుదలైన అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ఈ చిత్రం 50డేస్ ఫంక్షన్‌ని రాజశేఖర్ దంపతులు జరపనున్నారు.
దాంతో వారు ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా రావాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ని కోరారు. ఇక దీనికి బాలయ్య కూడా వస్తాడా? లేదా? అనేది తెలియదు. మొత్తానికి సినిమా రిజల్ట్‌ని పక్కనపెట్టిన యూనిట్ ఈ చిత్రం 50రోజులు ఆడిందని చెప్పకుండా, ఆడి ఉంటే నేటికి 50రోజులు పూర్తి చేసుకునేది అన్నట్లుగా ఈ వేడుకను జరపనుండటం విశేషం.