బెంగుళూరులోనే కాదు.. కర్ణాటక అంతా తెలుగు సినిమాలకి, తెలుగు స్టార్స్‌కి వీరాభిమానులు ఉన్నారు. ఇక కోలీవుడ్ హీరోలకు కూడా కర్ణాటకలో విపరీతమైన క్రేజ్ ఉంది. దాంతో తెలుగు, తమిళ స్టార్స్ చిత్రాల విడుదల సందర్భంగా అక్కడి థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు.. ఇలా అందరూ తమ నగరాలలోని అన్ని థియేటర్లను ఇతర భాషా చిత్రాలతో నింపివేస్తారు. ఇక తెలుగు, తమిళ చిత్రాలతో పోలిస్తే కన్నడ చిత్రాలు చాలా తక్కువ బడ్జెట్‌తో, మీడియం బడ్జెట్‌తో రూపొందుతాయి. దాంతో ప్రేక్షకులు కూడా భారీతనం, స్టార్ వాల్యూ ఉన్న చిత్రాలకే వెళ్తుంటారు. దీనిపై ఎప్పటినుంచో బెంగుళూరు, కర్ణాటక వ్యాప్తంగా ఆందోళనను చెలరేగుతున్నాయి.
కేవలం '2.0' పోటీకి వస్తోందని తెలిసే మన నిర్మాతలు ఇంతలా ఆ చిత్రం తేదీ మార్చుకోవాలి, పండగలు, వేసవిలో డబ్బింగ్ చిత్రాలపై బ్యాన్ విధించాలని మండిపడుతున్నారు. మరి మన 'బాహుబలి' వల్ల ఎన్ని ఇతర భాషా చిన్న చిత్రాలు ఇబ్బందుల్లో పడ్డాయో వీరికి తెలియదా? ఇప్పుడు అదే సమస్య మరాఠీ చిత్రాలకు కూడా దాపురించింది. తాజాగా విడుదలైన సల్మాన్, కత్రినాకైఫ్‌ల 'టైగర్ జిందాహై' చిత్రంతోనే ముంబైలోని అన్ని స్క్రీన్స్, షోలు నిండిపోయాయి. దాంతో విడుదలకు సిద్దమైన రెండు చిన్న మరాఠీ చిత్రాలకు ముంబైలో థియేటర్లు ఇచ్చేవారే లేరు.
తమ సొంత గడ్డ మీద తాము థియేటర్ల కోసం బాలీవుడ్ చిత్రాల నిర్మాతలను దీనంగా అడుక్కోవడం దారుణమని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన వాదిస్తోంది. ఇలాగైతే బాలీవుడ్ చిత్రాల షూటింగ్స్‌ని తమ రాష్ట్రంలో జరపకుండా అడ్డుకుంటామని వారు వాదిస్తున్నారు. మరి ఈ సమస్య ఎలాతేలనుందో..!