బాలకృష్ణ - కె ఎస్ రవి కుమార్ కాంబినేషన్ లో వస్తున్న.. 'జై సింహా' సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. సినిమాని జనవరి 12 న విడుదల చేస్తామని మూవీ యూనిట్ ఎప్పుడో ప్రకటించినప్పటికీ.. ఇప్పటివరకు పాటల చిత్రీకరణలోనే బిజీగా వుంది. తాజాగా 'జై సింహా' ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టిన మూవీ యూనిట్ ఇప్పుడు గత రెండు రోజుల నుండి బాలకృష్ణతో కూడిన 'జై సింహా' పోస్టర్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు 'జై సింహా' టీజర్ ని కూడా విడుదల చేసింది చిత్ర బృందం.
బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియలు నటిస్తున్న ఈ మూవీ టీజర్ లో బాలకృష్ణ ఉగ్ర రూపాన్ని చూపించేశాడు. డైలాగ్ తో ఇరగదీశాడు. అసలు బాలయ్య బాబు సినిమా అంటేనే.. యాక్షన్ సీన్స్ కి, పవర్ ఫుల్ డైలాగ్స్ కి పెట్టింది పేరు. మరి 'జై సింహా' లో కూడా అలాంటి యాక్షన్ సీన్స్ ని, పవర్ ఫుల్ డైలాగ్స్ తోనే నింపేశారు. యాక్షన్ సీన్స్ లో రౌడీలను ఎడా పెడా బాదేస్తూ బాలయ్య బాబు విశ్వ రూపాన్ని చూపించడమే కాదు.. హీరోయిన్ నయనతార, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా అలా వచ్చి ఇలా మాయమయ్యారు.
మరి బాలకృష్ణ సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు... సైలెంట్ గా ఉంది కదా అని కెలికితే తలకొరికేస్తుంది.. అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో అలరించేశాడు. మరి నందమూరి ఫ్యాన్స్ బాలయ్య సినిమా అంటే ఎలా ఉండాలి అని కోరుకుంటారో ఈ 'జై సింహా' కూడా అలానే ఉండబోతుందనేది ఈ టీజర్ లో తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన చిత్తరంజన్ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరింది. ఇక 'జై సింహా' ఆడియో వేడుక ఈ నెల 24 న విజయవాడలో జరగనుంది.