వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక ఆయన తాను రాజకీయాలలో బిజీగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి పదవికి తన కుమారుడు కేటీఆర్‌ని సమాయత్తం చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. తెలంగాణ టీఆర్‌ఎస్ నేతలందరూ కేటీఆర్‌ని కాబోయే ముఖ్యమంత్రి అని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఇక పాలనాధక్ష్యత పరంగా హరీష్‌రావు, కవితలకు కూడా మంచి మార్కులే పడుతున్నాయి. కానీ కావాలనే హరీష్‌రావుకి ప్రాధాన్యం తగ్గిస్తూ తన కుమారుడైన కేటీఆర్‌కి పూర్తి అధికారాలను అనఫీషియల్‌గా కేసీఆర్ కట్టబెట్టాడని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ ప్రముఖ వేడుకలప్పుడు హరీష్‌రావు తరచుగా కనిపించడం కూడా మానేశాడు.
మొత్తానికి కేటీఆర్, హరీష్‌రావు, కవితలు కేవలం వారసులుగానే మిగిలిపోయి అదే ముద్రలో ఉండిపోకుండా తమదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇక తాజాగా ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ 'లీడర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు కేటీఆర్‌ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం లాబీలతోనో, లేక కేసీఆర్ మెప్పుకోసమో ఇచ్చిన అవార్డు కాదని, కేటీఆర్‌కి ఆ అవార్డుకి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కళంగా ఉన్నాయని అందరూ నమ్ముతున్నారు. తాజాగా తెలుగు సినీ ప్రముఖులు కూడా ఈ విషయంలో కేటీఆర్‌ని అభినందనలతో ముంచెత్తారు.
ఇక ఈ అవార్డును ఆయన తాజాగా న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖా మంత్రి హర్‌దీప్‌సింగ్ చేతుల మీదుగా కేటీఆర్ అందుకున్నారు. ఇక తెలంగాణకు మరో అవార్డు కూడా వచ్చింది. ఉత్తమ పట్టణ మౌళిక సదుపాయాలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణకు ఈ అవార్డు వరించింది. ఈ కార్యక్రమంలో ఎంపీలు కవిత, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ పొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన కేటీఆర్ 'లీడర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపాడు. ఆయన మరిన్ని ఉన్నతశిఖరాలను అందుకోవాలని ఆశిద్దాం.