నాగార్జున చిన్నకుమారుడు అఖిల్ మొదటి చిత్రంగా వచ్చిన 'అఖిల్' చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో నాగార్జున ఈసారి అన్ని బాధ్యతలను తానే తీసుకుని తమ ఫ్యామిలీకీ 'మనం' వంటి క్లాసిక్ హిట్‌నిచ్చిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో 'హలో' చిత్రాన్ని రీలాంచింగ్ ఫిల్మ్‌గా తీర్చిదిద్దాడు. డిసెంబర్ 22 విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ విషయంలో మాత్రం నాగార్జున ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. రానా నుంచి నాగచైతన్య, సమంత, అమల, చిరంజీవి, రామ్‌చరణ్.. ఇలా అందరి చేత ప్రమోషన్ చేయిస్తున్నాడు.
ఇక ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకకి చిరంజీవి, రామ్‌చరణ్‌లు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. ఓ కుటుంబ వేడుకలా భావించి వచ్చాను. అఖిల్ మొదటి చిత్రం 'అఖిల్'లో అతను వేసిన స్టెప్స్ చూసి ఆశ్యర్యపోయాను. ఇక ఈ 'హలో' చిత్రం ఫెంటాస్టిక్ లవ్‌స్టోరీ. 'మనం' తీసిన విక్రమ్ కె.కుమార్ అదే స్థాయిలో ఈ చిత్రాన్ని తీశారు. ఈరోజే సినిమా చూశాను. ఈ చిత్రం అఖిల్‌ని మరో మెట్టు పైకెదిగేలా చేస్తుంది. ఇక 'హలో' అనే మాటకి అక్కినేని కుటుంబానికి ఎంతో సంబంధం ఉంది. నాడు ఏయన్నార్ 'హలో హలో అమ్మాయి.. ' అని అంటే, నాగార్జున -అమల 'హలో గురూ ప్రేమకోసమేరో..' అన్నారు. ఇప్పుడు అఖిల్ కూడా 'హలో' అంటూ రానున్నాడు. ఈ టైటిల్ పెట్టినవారికి నిజంగా హ్యాట్సాఫ్. ఇక అఖిల్ మా ఇంటికి వస్తే ముందుగా మమ్మల్ని పలకరించిన తర్వాతే చరణ్ వద్దకు వెళ్తాడు. రామ్‌చరణ్, అఖిల్‌లు కలిసి అన్యోన్యంగా మాట్లాడుకుంటూ ఉంటే రామ్‌చరణ్‌కి తమ్ముడు లేని లోటును అఖిల్ తీరుస్తున్నాడని సురేఖ సంతోషపడుతూ ఉంటుంది.
ఇక ఈ చిత్రంలో యాక్షన్, చేజింగ్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా పూర్తయిన తర్వాత కన్నీళ్లు వచ్చాయి. అలా ఈ చిత్రం గుండెలని తాకుతుంది. యూత్‌నే కాదు.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. తాత, తండ్రి, అన్నయ్యల కంటే అఖిల్ మంచి నటుడవుతాడు. హీరోయిన్ కళ్యాణి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక రమ్యకృష్ణ, జగపతిబాబుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మరలా ఈ చిత్రం విజయోత్సవానికి వస్తానని మెగాస్టార్ అన్నారు.