తాజాగా తెలంగాణ ప్రభుత్వం హయాంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు సినీ ప్రముఖులతో పాటు పలువురు పెద్దలు హాజరైన సంగతి తెలిసిందే. ఇక వేడుకకు వచ్చిన అందరూ కేసీఆర్‌పై పొగడ్తలతో ముంచెత్తడం, కేటీఆర్‌ని పొగటమే పనిగా పెట్టుకుని తమ ప్రసంగాలలో వాటినే హైలైట్ చేశారు గానీ అసలు విషయాన్ని మాత్రం వదిలేశారు. కానీ ఒక్క బాలకృష్ణ మాత్రం తనదైన శైలిలో తెలుగు గురించి గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు. తెలుగువారి పంచెకట్టులో హాజరైన బాలయ్య ఈ మహాసభలలో మర్చిపోయిన తన తండ్రి ఎన్టీఆర్, చంద్రబాబునాయుడులను కూడా ఈ వేదికపై ప్రస్తావన తీసుకొచ్చారు.
ఇక వీర తెలంగాణ పుత్రులకు, విప్లవ తెలంగాణ ఆడబిడ్డలకు నా కళాభివందననాలు తెలపడమే కాదు.. తెలంగాణలో పుట్టిన వారికి ఆదరించడం తెలుసు అలాగే ఎదురించడం కూడా తెలుసునని తెలంగాణ వాదులను ఆకట్టుకునేలా తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. వాస్తవానికి బాలకృష్ణకి తెలంగాణలో అభిమానులు తక్కువ. ఆయన తెలుగుదేశం వాడు కావడంతో పాటు తెలంగాణ ప్రజలకు తెల్లన్నం అంటే ఏంటో తెలియదని, దానిని వారికి అలవాటు చేసింది తన తండ్రి ఎన్టీఆరేనని గతంలో మాట్లాడి వారి నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు.
ఇక తాను ఉండేది హైదరాబాద్. తన ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. కాబట్టి కేసీఆర్‌ని ఆయన ఎదిరించే పరిస్థితి లేదు. ఇక తన 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి తెలంగాణలో కూడా కేసీఆర్ పన్ను మినహాయింపు ఇచ్చాడు. దాంతో బాలయ్య ఓ రాజకీయనాయకునిగా కాకుండా ఓ సినీ ప్రముఖునిగా ఈ వేడుకలకు హాజరయ్యాడు. కానీ చంద్రబాబు మనుషులు మాత్రం బాబుని పిలవని చోటికి, ఎన్టీఆర్‌ని పట్టించుకోని సభలకు బాలయ్య వెళ్లి మాట్లాడటం అవసరమా? అని అంటున్నారు. వీరిలో ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు మాత్రం తమ కుటుంబ పెద్ద అయిన ముఖ్యమంత్రిని పిలవకుండా తాను వెళ్లడం సమంజసం కాదని తేల్చిచెప్పాడు.