ప్రత్యేక రాష్ట్రం విషయంలో తెలంగాణ ఎంపీలందరు కుల, మత, రాజకీయాలకు అతీతంగా సామాన్యులు, మేధావులు, కళాకారులు అందరినీ కలుపుకుని వెళ్లి తమ తెలంగాణను తెచ్చుకున్నారు. కానీ ఏపీ ఎంపీలు మాత్రం తమ వ్యాపారాలు, కాంట్రాక్ట్‌లతో బిజిగా ఉన్నారు. ఇక ప్రత్యేకహోదా నుంచి ప్రత్యేక ప్యాకేజీ అన్నా కూడా నోరు మెదపడం లేదు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ నుంచి ఏ విషయంలోనూ మన ఎంపీల నుంచి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు వరకు అందరూ మౌనంగానే ఉంటున్నారు గానీ కేంద్రంతో తలపడాలంటే భయపడిపోతున్నారు.
ఇక లాభాలలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరించడంపై కూడా తమ గొంతుని వినిపించడం లేదు. మోదీని చూసి భయపడి పోయి కాళ్ల మీద పడుతున్నారు. జల్లికట్టు తరహా ఉద్యమం అనేసరికి కావాలంటే పందులతో పోట్లాడమని మన గౌరవనీయులైన ఏపీకి చెందిన కేంద్రమంత్రి వర్యులు పోరాడే వారిని కూడా అడ్డుకుంటున్నారు. ఇక పోలవరంలో జాప్యం జరుగుతున్నా, రాజధాని విషయంలో వివక్షత ఎదురవుతున్నా కూడా మన ఏపీ ఎంపీలకు పోరాడే తత్వం, పోరాట పటిమ కనిపించడం లేదు.
ఇక 'డిసిఐ' ప్రైవేటీకరణ విషయంలో ఇటీవల స్వయంగా పర్యటించిన జనసేనాని తాజాగా ఏపీ ఎంపీల తీరును ఎండగట్టారు. తమిళనాడులో నష్టాలతో నడుస్తున్న సాలెం స్టీల్‌ప్లాంట్‌ని ప్రైవేటీకరించ వద్దని స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి మోదీని కలిసి మెమొరాండం సమర్పించారు. కానీ మన ఎంపీలు, ఏపీలోని ప్రభుత్వం ఆ పని కూడా చేయలేకపోతున్నాయి. కనీసం ఓ వినతిపత్రాన్ని మోదీకి ఇవ్వడానికి కూడా మన ఎంపీలకు ఏమి అడ్డువచ్చిందో అంటూ తనదైన శైలిలో పవన్ ట్వీట్స్ చేయడం సంచలనంగా మారింది..!