ఓ వేయి పేజీల పుస్తకంలో చెప్పలేని దానిని రెండున్నర గంటల్లో సినిమాగా చెప్పవచ్చు. పేజీ నిండా ఉండే డైలాగ్‌లతో చెప్పలేని విషయాన్ని ఓ సీన్‌లో చూపించవచ్చు. ఇలాగే ఎన్నో పదాలతో, వాక్యాలతో చెప్పలేని భావాలను కవిత్వంతో చెప్పవచ్చు. ఇలా ఏ విషయంపైనైనా తనదైన శైలిలో కవిత్వంలో చెప్పగల సహజకవి తనికెళ్లభరణి. ఆసుకవిత్వంతో పాటు ప్రాసలతో ఆయన అప్పటికప్పుడు తన నోటి వెంట కవితలు జాలువారుతుంటాయి. ఇదే పనిని తనికెళ్ల భరణి 'అజ్ఞాతవాసి' వేడుకలో చెప్పి మెప్పించాడు.
నేను పవన్ గురించి మూడే మాటలు మాట్లాడగలను. ఒకటి పవన్‌కళ్యాణ్, రెండు పవన్‌కళ్యాణ్, మూడు పవన్‌కళ్యాణ్.. అంతే. ఇంకేం మాట్లాడుతాను నేను. ఇప్పుడు నిజంగా మాట్లాడుతున్నాను. పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వస్తున్న 'అజ్ఞాతవాసి'లో నేను వేషం వేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుంది.. అంటూ పవన్ గురించి ఓ కవితను చెప్పాడు.
'అతగాడు మితాభాషి..నిత్య సత్యాన్వేషి...అర్జునుని వంటి అజ్ఞాతవాసి' అని చెప్పి ఎన్నో మాటలలో ఉన్న అర్ధాన్ని ఈ చిన్న కవితతో మొత్తం చెప్పేశాడు. ఇక తాజాగా ఆయన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తన గురువుని ఉచితాసనంపై కూర్చొబెట్టి పాదాభివందనం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా ఓ అద్భుత కవిత చెప్పిన విషయం తెలిసిందే. నిజానికి ఇలాంటి సరస్వతీపుత్రలు దీవెనలు అందుకోవడం పవన్, త్రివిక్రమ్ వంటి వారి అదృష్టమనే చెప్పాలి.