ప్రస్తుతం యంగ్ రెబెల్‌స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు తన కెరీర్ మొదట్లో చిన్న చిన్నవేషాలు, విలన్ పాత్రలు చేస్తూ తన గంభీరమైన రూపం, కంఠస్వరంతో 'రెబెల్‌స్టార్'గా గుర్తింపు పొందాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చేనాటికి ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు వంటి వారు మంచి పీక్స్‌లో ఉన్నారు. ఇక ఎవరివైనా అండదండలతో మీరు ఈ ఫీల్డ్‌లోకి ప్రవేశించారా? లేక సొంతగానే ఎదిగారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఎవరో ఒకరు అవకాశం ఇస్తేనే కదా చాన్స్ వచ్చేది? నన్ను హీరోగా పరిచయం చేసింది ప్రత్యగాత్మగారు. నన్ను చూడగానే బాగున్నాడే..కొత్త హీరోగా పరిచయం చేయవచ్చు అన్నారు. అప్పుడు నాతో 'పరివర్తనం' అనే నాటకం వేయమని అడిగారు. నాకు అంతకు ముందు నాటకాలు వేసిన అనుభవం లేదు. కానీ ప్రత్యగాత్మ గారి కోరిక మీద నాటకం వేశాను. దానిని చూసి ఆయన నువ్వే నా సినిమాలో హీరోవి అని చెప్పారు. అలా 'చిలక గోరింక'తో పరిచయం అయ్యాను...అని చెప్పారు.
ఇక కృష్ణంరాజు కేవలం నటునిగానే కాదు... నిర్మాతగా కూడా భారీ బ్లాక్‌బస్టర్స్ అందించారు. గోపీకృష్ణా బేనర్‌లో ఆయన ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించి, నటించారు. 'మనవూరి పాండవులు, భక్తకన్నప్ప, అమరదీపం, కృష్ణవేణి'వంటి బ్లాక్‌బస్టర్స్ ఆయన కెరీర్‌లో ఎన్నో ఉన్నాయి. ఇక ఆయన మాట్లాడుతూ..మేకప్ వేసుకున్నానంటే అది 10గంటలైనా, 12 గంటలైనా ప్రపంచం మర్చిపోయేవాడిని. నా పాత్ర బాగుంటే దానిని సినిమాకి ఎలా హెల్ప్ చేయాలా? అనే ఆలోచన తప్ప మరోటి ఉండేది కాదు. నేను ఇండస్ట్రీని నా సొంతానికి వాడుకోకుండా నా ద్వారా సినిమాలకి హెల్ప్ అయ్యేలా చేశాను. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతిది సిస్టమేటిక్‌గా ఉండాలని నేను భావిస్తాను. అలా అంకిత భావంతో పని చేస్తూ వచ్చానని వివరించారు.