సామాన్యంగా సినిమా ఫీల్డ్‌లో ముఖస్తుతి ఎక్కువ. పక్కవారు మనల్ని నాలుగు పొడిడారంటే మనం మరో నాలుగు పొడలాలి. ఇక్కడ ఎవ్వరూ ఎవ్వరినీ ఊరికే భజన చేయరు. తమకి భజన కావాలంటే పక్కనోళ్లని పొగిడితేనే అది వీలవుతుంది. ఇక స్టార్స్ ఆధిపత్యంలో కొట్టుమిట్టాడుతూ, వ్యక్తిగత ఆరాధనలకు, మనుషులనే దేవుళ్లని చేసే వారికి ఇండస్ట్రీలో కొదువలేదు. ఇక అభిమానులు కూడా అదే చందంగా ఉండటంతో నిజమైన పొగడ్తలకు కూడా విలువలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఏ సినిమా సక్సెస్.. ? ఏది ఫ్లాఫ్? అనేవి స్పష్టంగా ప్రేక్షకులకు తెలుస్తున్నా కూడా సినీ జనాలు మాత్రం సక్సెస్ మీట్లు ఎలా నిర్వహిస్తున్నారో పొగడ్తలు కూడా అలాగే తయారయ్యాయి.
ఎవరి బిరుదులు వాళ్లే ఫిక్స్ చేసుకుంటున్న నేటిరోజుల్లో నిజమైన పొగడ్త అనేది నేతి బీరకాయలోని నెయ్యి చందంగా మారింది. ఎవరి డప్పులు వాళ్లే వాయిస్తున్నారు. ఇంకొందరు మీడియా మిత్రులు పెద్దస్టార్స్‌ని అవతారపురుషులని చేస్తూ వాళ్ల బయోగ్రఫీలతో అదరగొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొందరి ప్రశంసలకు ఎంతో విలువ ఉంది. ఎందుకంటే వారు మనసుని ఏదైనా తాకి, మనసుకి అనిపిస్తేనే చాలా అరుదుగా స్పందిస్తారు. ఆ కోవలోకి వచ్చే వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన ప్రశంసించాడంటే ఏదో విషయం ఉందనే అందరూ నమ్ముతారు.
అలాంటి అరుదైన సిరివెన్నెల.. పవన్‌పై చేసిన ప్రశంసలను గమనిస్తే పవన్ కెరీర్‌లోనే ఆయనకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్‌గా సిరివెన్నెల పొగడ్తలను పేర్కొనవచ్చు. తాజాగా 'అజ్ఞాతవాసి' వేడుకలో సిరివెన్నెల పవన్ గురించి మాట్లాడుతూ, పవన్ కూర్చుని ఉంటే ఆయనను పొగడటం సునామీలో పిల్లనగ్రోవి వాయించడమేనని వ్యాఖ్యానించారు. ఇక ఇది త్రివిక్రమ్ సంధించిన 'కళ్యాణాస్త్రం' అని, ఇది పవనాస్త్రం అని పొగిడి ఈ చిత్రం విడుదలై కలెక్షన్ల సునామీ సాధించాలని, అనిరుధ్ కి తాను శుభాకాంక్షలు చెబుతూ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. కాబట్టి.. పవన్ కలకాలం తనకు లభించిన గొప్ప పొగడ్తగా సిరివెన్నెల మాటలను చెప్పుకోవచ్చు.