డీజే సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హరీష్ శంకర్.. ఇపుడు మరొక సినిమాని పట్టాలెక్కించే పనిలో బిజీగా వున్నాడు. ఇప్పుడు హరీష్ రాసుకున్న డిఫరెంట్ సబ్జెక్ట్ తో దాగుడుమూతలు సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు అదే టైటిల్ అంటే దాగుడుమూతలును రిజిస్టర్ కూడా చేయించారు. ఇక హరీష్ శంకర్ అయితే స్క్రీన్ ప్లే కూడా లాక్ చేశాడు. ఇప్పుడీ సినిమాకు స్టార్ కాస్ట్ ఫైనలైజ్ చేసే పనిలో చిత్ర బృందం అంతా బిజీగా ఉన్నారు. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా కోసం అటు దర్శకుడు హరీష్ శంకర్, ఇటు దిల్ రాజు కూడా బిజీగా వున్నారు.
అందులో భాగంగానే దాగుడుమూతల కోసం ఇప్పటివరకు ముగ్గురు నటీనటులను ఫైనలైజ్ చేశారు. దాగుడుమూతలు సినిమాలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అయితే ఇద్దరు హీరోల్ని దిల్ రాజు ఇప్పటికే ఫిక్స్ చేశాడు. ఆ హీరోలెవరో అందరికి తెలుసు. హీరో నితిన్, శర్వానంద్ ను తీసుకున్నట్టు దిల్ రాజు తన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించాడు. మరోవైపు దర్శకుడు హరీష్ శంకర్ హీరోయిన్ల ఎంపిక బాధ్యతను తీసుకున్నాడు. ఇక హరీష్ శంకర్ ఒక హీరోయిన్ గా రకుల్ ను ఫైనల్ చేశాడనే టాక్ బయటికి వచ్చింది.
తాజాగా హరీష్ శంకర్ హీరోయిన్ రకుల్ ను కలిసిన స్టోరీ వినిపించాడని... దాగుడుమూతలు సినిమాలో నటించేందుకు రకుల్ సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఒక హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ఎంపికైతే.. ఇప్పుడు మరో హీరోయిన్ మాత్రమే పెండింగ్ ఉందన్నమాట. మరి ఆ రెండో హీరోయిన్ ని అతి త్వరలోనే ఫైనల్ చేస్తారంటున్నారు.