పవన్ కళ్యాణ్ ఈ మధ్యన రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుండి చక్కటి ప్రసంగాలు చేస్తున్నాడు. ఎంతో క్లారిటీగా ప్రజాసమస్యలపై గళమెత్తుతున్నాడు. అయితే పవన్ మాటల్లో అంత స్పష్టత ఉండడానికి వెనుక మరొకరున్నారని.. అది కూడా పవన్ నీడ దర్శకుడు త్రివిక్రమ్ అనే ప్రచారం బాగా వుంది. అయితే పవన్ కి సలహాదారుగా త్రివిక్రమ్ అనే టైటిల్ కి పవన్ కళ్యాణ్ ఈ మంగళవారం నోవెటల్ లో జరిగిన అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అతిరధ మహారథుల మధ్యన జరిగిన అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో పవన్ కి త్రివిక్రమ్ మీద ఎంత గౌరవం ఉందో ఫ్యాన్స్ సాక్షిగా చాటుకున్నాడు.
తన వెనుక త్రివిక్రమ్ ఉన్నాడనే మాట వాస్తవం కాదంటూనే.. త్రివిక్రమ్ తనకి సలహాలు ఇస్తుంటాడని చాలా చాలా రకాలుగా చాలామంది భావిస్తారు.. అలాంటి సమయంలో నాకు కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా అనుకున్నవాళ్లంతా ఒంటరివాణ్ణి చేసినప్పుడు, అలాగే డిప్రెషన్ లోకి వెళ్లిన సమయంలో ఒక ఆప్తుడిలా ఆదుకున్నాడు. ఒక మంచి వ్యక్తిని పరిచయం చేస్తానని చెప్పి త్రివిక్రమ్ నాకో పుస్తకం ఇచ్చాడు. అలాగే డిప్రెషన్ లోనుండి బయటికి రావడానికి మంచి కవితలు వినిపించేవాడు. నాకు అపజయాలు వచ్చినప్పుడు వెన్నంటి ఉండి ధైర్యం చెప్పాడు.
అంతేకాకుండా నేను స్వతహాగా రక్తం పంచుకుని పుట్టిన వారిని కూడా కోప్పడలేని నేను త్రివిక్రమ్ ని కోప్పడగలను.. ఎందుకంటే ఆయనతో నాకంత చనువుంది.. త్రివిక్రమ్ నాకు మంచి మిత్రుడు. ఆయనకు నేనేం ఇవ్వగలను. నేను లేకపోతే ఆయన లేరా. ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చదివిన వ్యక్తి, గోల్డ్ మెడలిస్ట్, గొప్ప రచయిత. ఆయన నాతో దర్శకుడు కాలేదు. స్వశక్తితో దర్శకుడు అయ్యారు. నాతో ఆయనకు అవసరం ఏముంది. నేను కాకపోతే ఇంకొకరు. వందమంది హీరోలు దొరుకుతారు. సృజనాత్మకత ఉన్న వ్యక్తికి హీరోలు ఎప్పుడైనా దొరుకుతారు. కానీ మా ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే ఆలోచన విధానం. పెద్దవాళ్లంటే గౌరవం. సినిమా పరిశ్రమ అంటే మోకరిల్లేంత గౌరవం. ఈ భావజాలమే మమ్మలను దగ్గర చేసింది.. అంటూ త్రివిక్రమ్ గురుంచి పవన్ తెలిపాడు.